టీడీపీ స్వయం కృతాపరాథం
తెలుగుదేశం.. మూడు దశాబ్దాల క్రితం పురుడుపోసుకున్న పార్టీ. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన పార్టీ. తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్‌టీ రామారావు స్థాపించిన పార్టీ తర్వాతికాలంలో జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక భూమికే పోషించింది. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు దూరంగా కొందరు పెద్దలకు దగ్గర సాగుతున్న పరిపాలన వ్యవస్థను భూమార్గం పట్టించి ప్రజలకు పరిపాలన వ్యవస్థను చేరువ చేసిన పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు తమ గతమెంతో ఘనమని చెప్పుకోవడం మినహా స్వయం ప్రభను కోల్పోయింది. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలంటూ తెలంగాణ ప్రజలపై బలవంతపు సమైక్యవాదాన్ని రుద్ది బొక్కా బోర్లాపడింది. 2004 ఎన్నికల్లో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ తెలంగాణవాదానికి జై కొన్ని బరిలో నిలువగా, ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే సమైక్యవాదాన్ని ఎత్తుకుంది. దానికి ఫలితాన్ని అనుభవించింది. చావుతప్పి కన్నులొట్టపోయినట్టు కొద్ది సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాను పొందింది. స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మిస్తానంటూ పల్లెసీమలను విస్మరించి విదేశాల వెంట పరుగెత్తిన చంద్రబాబును, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలని చూసిన ఆంధ్రాబాబును తెలంగాణ ప్రజలు నిలువెడు గోతితీసి కప్పెట్టారు. ఒకప్పుడు పరిపాలనాధ్యక్షుడిగా, రాజకీయ చతురిడిగా పేరుపొందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక ఆ బిరుదులకూ దూరమయ్యాడు. ఆయన తెలంగాణపై అనుసరించిన వైఖరి ఈ ప్రాంతంలో ఆ పార్టీకి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. తెలంగాణపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అస్పష్టమైన విధానాలే అవలంబిస్తోంది. 2004 ఎన్నికలకు పూర్వం చంద్రబాబు చెప్పిందే రాష్ట్ర ప్రజలకు వేదం అన్న రీతిలో ఆ పార్టీ నాయకులు వ్యవహరించేవారు. ఆయన రోజుకు 17, 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు చెప్పుకునేవాడు. కానీ ఆయన చేసిన పనులేవి సామాన్యుల కోసం కాదు. కార్పొరేట్ శక్తులు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడుతున్న సీమాంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారుల కోసమే. ఆయన హయాంలోనే నయా మిలియనీర్లు, బిలియనీర్లు అవతరించారు. తెలంగాణ వనరులు, హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములను వివిధ పేర్లతో అప్పనంగా కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. కేవలం వారి ప్రయోజనాల పరిరక్షణ కోసమే చంద్రబాబు రాష్ట్రమంతా సమైక్యంగా ఉండాలనే తన అభిప్రాయాన్ని ప్రజలందరిపై రుద్దాలని ప్రయత్నించారు. ఒకసారి అధికారాన్ని కోల్పోయాక కానీ ఆయన వాస్తవాలు గుర్తించలేదు. అయినా ఏదో చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవాలనే చూశాడు. తెలంగాణ ఏర్పాటు కోసమే ఆవిర్భవించినట్టు చెప్పుకునే టీఆర్‌ఎస్‌తో 2004 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ-1 అధికారం చేపట్టగానే తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చింది. రాష్ట్రపతి ప్రసంగంలోనూ పెట్టింది.
తర్వాతికాలంలో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు విషయంలో అంతులేని జాప్యం చేసింది. దీనిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ యూపీఏకు గుడ్‌బై చెప్పి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. ఇలా తెలంగాణ అంశం జాతీయ స్థాయిలో ప్రభావం చూపడంతో యూపీఏ-1 తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటివరకూ సమైక్యవాదాన్ని భుజానికెత్తుకున్న టీడీపీ వైఖరిలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. జై తెలంగాణ అనకుండా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ లేఖనే చూపుతూ టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు లాభించి తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి ఎక్కువ సీట్లే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొన్ని రోజుల్లోనే ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ పోరుబాట పట్టింది. అదే సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమ హోరుతో దిగివచ్చిన యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9న ప్రకటించింది. ఇందుకు రెండు రోజుల ముందు హైదరాబాద్‌లో అప్పటి సీఎం రోశయ్య నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ అధినేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి తీరాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టారు. ఆ మీటింగ్ మినిట్స్ ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయం ప్రకటించడంలో ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబు ప్రమేయం ప్రబలమైనదే. ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు రాష్ట్ర విభజనపై అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంటారా? అసలు ఎవర్నడిగి ప్రకటన చేశారు అంటూ అడ్డంగా వాదించాడు. అంతటితో ఆగకుండా మొదట తన సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో వరుసపెట్టి రాజీనామా చేయించారు. వివిధ పార్టీల్లోని పెట్టుబడిదారులను పోగేసి సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమానికి వ్యూహ రచన చేశాడు. ఆ పార్టీ శ్రేణులు ఎంత కాదన్నా ఇదే నిజమని ఇటీవల టీడీపీని వీడిన సీమాంధ్ర నేతలే పేర్కొన్నారు. చంద్రబాబు అంతటితో ఆగలేదు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు.
ప్రతిపక్ష నేతగా ప్రజలపక్షం వహించాల్సిన బాబు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులను తన భుజాలపై పెట్టుకొని ఊరేగించాడు. తెలంగాణపై టీడీపీ అధినేత వైఖరిని తప్పుబడుతూ ఇద్దరు పొలిట్ బ్యూరో సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని వీడారు. ఒకప్పుడు చంద్రబాబుకు రక్షణ కవచంలా నిలిచిన నాగం జనార్దన్‌రెడ్డి, కడియం శ్రీహరి టీడీపీ గుడ్‌పై చెప్పాల్సి రావడం ఆ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాథం. వారిద్దరే కాదు సీనియర్ ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, మొదటిసారి శాసనసభకు ఎన్నికైన జోగు రామన్న, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేశ్ టీడీపీని వీడారు. బాబు పాటిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతంతోనే విసిగి వీరంతా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు వీరు మాత్రమే పార్టీ వీడారు. భవిష్యత్‌లో మరెందరో పసుపుజెండాను పక్కనబెడతారో చంద్రబాబుక్కూడా తెలియదు. పరిస్థితి ఇంత దూరం తీసుకువచ్చింది చంద్రబాబే. ఆయన స్వయం కృతాపరాథంతోనే పార్టీ తెలంగాణలో ఉనికిని వెదుక్కోవాల్సిన స్థితికి దిగజారింది.