డిజిల్ ధర పెంపుపై భగ్గుమన్న విపక్షాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (జనంసాక్షి) :
డీజిల్‌పై లీటర్‌కు 6 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం రాజకీయ పార్టీలు భగ్గుమం టున్నాయి. గ్యాస్ సిలెండర్ల వాడకం పరిమితి నిర్ణయాలపై కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గిం చాలని,గ్యాస్ సిలెండర్ల పంపిణీలోనియంత్రణ ఎత్తివేయాలని బిజెపి సిపిఎం, సిపిఐ, టిడిపి పార్టీలు ప్రభుత్వాన్ని సూచించాయి. కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బిజెపి సిపిఐ పార్టీలు పిలుపునిచ్చాయి. పెంచిన డీజిల్ రేట్లను తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు జరిగిన ర్యాలీలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ అంటు కేంద్ర ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచుతోందని ఆయన విమర్శించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదుల సంఖ్యలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిందని, ఈ భారం సామాన్య ప్రజానీకంపై పడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నాయని, పెరిగిన డీజిల్ ధరతో నిత్యావసరాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందకుండాపోయే ప్రమాదం ఉందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికి ఆరు సిలెండర్లను మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాబు తప్పుబట్టారు. సంవత్సరానికి ఆరు సిలెండర్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను సవిూక్షించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బాబు హెచ్చరించారు. కేంద్రం నిర్ణయానికి నిరసనగా టిడిపి కార్యకర్తలు నగరంలో రాస్తారోకోలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారం ఎక్స్‌రోడ్‌లో టిడిపి ఇన్‌చార్జ్ వివేక్ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు, నాయకులు రహదారిపై కట్టెల పొయ్యితో వంటలు చేసి నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చూస్తుంటే పేదలను నిర్మూలిస్తున్నట్లుగా ఉన్నాయని వివేక్ అభిప్రాయపడ్డారు. డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తు నారాయణగూడ చౌరస్తా వద్ద బిజెపి కార్యకర్తలు యూపీఏ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ అవినీతిని అరికట్టలేని కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంలో ఉత్సాహం చూపుతోందని ఆరోపించారు. పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. డీజిల్ ధరల పెంపుతో దేశ ఆర్ధికవ్యవస్థ అతలాకుతలం అవుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. డీజిల్ ధరల పెంపు,గ్యాస్ సిలెండర్లను పరిమితం చేయటాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆయన తిరుపతిలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ఆర్ధిక రంగ నిపుణులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సలహాదారులకు పేద, మధ్యతరగతి ప్రజలు కనిపించడం లేదని ఆయన అన్నారు. డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉదృతం చేస్తామని నారాయణ హెచ్చరించారు. తెలంగాణపై కేంద్ర ¬ంశాఖ మంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని ఆయన అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేయాల్సిన కేంద్రం సమస్యను జఠిలం చేస్తోందని నారాయణ అభిప్రాయపడ్డారు.