తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 44మంది సజీవదహనం?

మరో 28 మందికి గాయాలు..
కొనసాగుతున్న సహాయక చర్యలు
నెల్లూరు, జూలై 30 :తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో లేచిన మంటలకు 44 మంది సజీవదహనమైనట్టు సమాచారం. 28మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని సమాచారం. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-11బోగీలో సోమవారం తెల్లవారుజామున 4.44 గంటలకు మంటలు లేచాయి. అప్పటికి రైలు నెల్లూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని విజయమహల్‌ గేటు వద్దకు చేరుకుంది. మంటలను చూసిన గ్యాంగ్‌మెన్‌ సమాచారాన్ని నెల్లూరు రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌కు అందించారు. ఈలోగా ట్రైన్‌లో ఒక వ్యక్తి చైను లాగడంతో డ్రైవరు రైలును నిలిపివేశారు. అప్పటికే బోగీ మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఒక తలుపు మాత్రమే తెరుచుకోవడంతో కొంతమంది మాత్రమే బయటకు రాగలిగారు. నిద్రలో ఉన్న మిగిలిన వారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేస్తూ అగ్ని కీలలకు దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అధికారిక చార్టు ఆధారంగా 72మంది ఉన్నట్టు రైల్వే అధికారులు చెప్పారు. తీవ్ర గాయాలకు గురైన 28 మందిని నెల్లూరు పట్టణంలోని రామచంద్ర, జయభారత్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించారు. సోమవారం మధ్యాహ్ననికి 30 మృతదేహాలను వెలికితీశారు. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. బోగీ అంతటా మాంసపు ముద్దలు, అస్తి పంజరాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కువగా అప్పర్‌, మిడిల్‌ బెర్త్‌లలో పుర్రెలు, మాంసపు ముద్దలు దర్శనమిస్తున్నాయి. ఒక తల్లీబిడ్డ కలిసి సజీవ దహనమైన దృశ్యం అందర్ని కలచివేస్తోంది. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల వంతున, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల వంతున, స్వల్పంగా గాయపడిన వారికి 25 వేల రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియోగా ఇవ్వనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.
దర్యాప్తు అనంతరమే..సిఎం కిరణ్‌
మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఎలా జరిగిందన్నది తేలుతుందని స్పష్టం చేశారు.
రైల్వే అధికారుల నిర్లక్ష్యమే.. : చిరంజీవి
రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
సిబిఐచేత విచారణ చేయించండి : చంద్రబాబు
జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడు ప్రమాదం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేస్తూ తప్పించుకుంటున్నాయన్నారు. జరిగిన ప్రమాదంపై సిబిఐ చేత విచారణ చేయించాలని, జ్యూడిషియరి విచారణకు కూడా ఆదేశించాలని కోరారు.
రైల్వే చార్టు ప్రకారం..
రైల్వే చార్టు ప్రకారం ఎస్‌-11 బోగీలో ప్రయాణీకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 17మంది, వరంగల్‌లో 6, విజయవాడలో 28, భోపాల్‌లో 11, ఆగ్రాలో 3, నాగపూర్‌లో ఒకరు, ఝాన్సీలో ఒకరు ఎక్కినట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విజయవాడ, వరంగల్‌కు చెందిన వారే ఉన్నారని తెలిసింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
సంఘటన సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు, అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బంది హుటాహుటిన దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎస్‌-11 బోగీ లింక్‌ను కట్‌ చేశారు. గ్యాస్‌ కట్టర్లతో తలుపులు కోసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి ఆసుపత్రి, బొల్లినేని, ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. కలెక్టర్‌ బి.శ్రీధర్‌, ఎస్‌పి బీవీ రమణకుమార్‌, ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి, తదితరులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే జరిగినట్టుగా అనుమానిస్తున్నట్టు కలెక్టర్‌ బి.శ్రీధర్‌ తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని.. ఆ తర్వాతే ఎంతమంది అన్నది చెప్పగలమని ఎస్‌పి రమణకుమార్‌ చెప్పారు. ఎంపి మేకపాటి రాజ్‌మోహన రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నా అప్రమత్తత లోపించడం వల్లే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు.
కార్బన్‌మోనాక్సైడ్‌ పీల్చడం వల్లే ..
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. కంపార్టుమెంట్లలోని సీట్లన్నీ రెగ్జిన్‌తో తయారు చేసి ఉండడం వల్ల మంటలు ప్రారంభం కాగానే అందులో నుంచి కార్బన్‌మోనాక్సైడ్‌ అనే విష వాయువు విడుదలై గాఢ నిద్రలో ఉన్న వారంతా సీట్లకే అతుక్కుపోయి మరణించారు. నేవీలో కీలకమైన బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెల్లూరు నగరంలోని బొల్లినేని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జైభారత్‌ ఆసుపత్రి, రామచంద్రారెడ్డి ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న వారంతా కార్బన్‌ డైఆక్సైడ్‌ విష వాయువు పీల్చి ఉండడం వల్ల నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించకపోయినట్టయితే వారు చనిపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.