తల్లడిల్లిన గోదావరి
– పుష్కరతీరాన మహావిషాదం
– తొక్కిసలాటలో 27మంది మృతి
– ఏర్పాట్లలో బాబు సర్కారు వైఫల్యం
– ఆగ్రహించిన ప్రతిపక్షం
– రాజీనామాకు డిమాండ్
రాజమండ్రి,జులై14(జనంసాక్షి):
పుష్కరాల్లో..మహా విషాదం నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం కారణంగా పుష్కరోదయం కనీవినీ ఎరుగని మహా విషాదాన్ని నింపిది. గోదావరి పుష్కరుడు తొలిరోజే తొక్కిసలాట రూపంలో 27మందిని బలి తీసుకున్నాడు. రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అయితే తొక్కిసలాటో కనీసం 30 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. చనిపోయిన వారంతా మహిళలు, వృద్దులు, చిన్నపిల్లలే కావడం విశేషం. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేసి పుణ్యం సంపాదించుకోవాలని వచ్చిన వీరు పుణ్యలోకాలకు చేరుకున్నారు. ఇరుకుగా ఉన్న దారిలో లక్షలాదిగా భక్తులు తోసుకుని రావడం, అక్కడ పోలీసులు, అధికారులు,కంట్రోల్ చేసేవారు లేకపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనతో రాజమండ్రి గోదావరి తీరం విషాదంలో నిండిపోయింది. చనిపోయిన వారి రోదనలతో గోదావరి క న్నీటి సంద్రమయ్యింది. దీనికితోడు తమవారను తప్పిపోయారంటూ అనేకమంది పోలీసులను కలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసినంతగా భద్రతా ఏర్పాట్లు సరిగా చేయలేదని ఘటనను బట్టి అర్థం అయ్యింది. సిఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పుష్కర స్నానం కోసం ఘాట్లను మూసి వేయడంతో భక్తులంతా తోసుకుని రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 300 మంది యాత్రికులు సృహ కోల్పోయారని సమాచారం. వీరందరిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..ఇతర వీఐపీలు పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ఉన్నంత వరకు భద్రతా ఏర్పాట్లన్నీ అక్కడే కేంద్రీకరించిన పోలీసులు, ఇతర ఘాట్ల వద్ద లక్షలాదిగా భక్తులు తోసుకుని వస్తున్న పట్టించుకోలేదు. సిఎం వెళ్లాక ఒక్కసారిగా భక్తులు తోసుకుని వస్తున్నా కంట్రోల్ చేయడానికి ఎవరు కూడా లేకపోవడమే ఈ దారుణానికి కారణమయ్యిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘాట్లను అందంగా తీర్చిదిద్దడం..రంగు రంగుల శోభతో అలరింపజేయాలన్న ఆలోచనే తప్ప ప్రభుత్వం పుష్కర స్నానాలకు వచ్చిన వారి కోసం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదనేది ఈ ఘటనతో ప్రస్పుటమౌతోంది. లక్షలాదిగా భక్తులు తరలివస్తే కంట్రోల్ చేసే విధంగా పోలీసులను నియమించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై సిఎం చంద్రబాబు తీవ్ర దిగా్భంతిని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసారు. మృతుల్లో ఇద్దరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సవిూపంలోని యండగండికి చెందిన రుద్రరాజు లక్ష్మి(65), విశాఖజిల్లా పెందుర్తికి చెందిన మంగమ్మ(60)గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పుష్కరఘాట్ వద్దకు ఒకేసారి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. గోదావరి పుష్కరఘాట్‌వైపు వచ్చే భక్తులను వారిని వీఐపీ ఘాట్, కోటిలింగాల వైపు మళ్లిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తన్నారు.
ముందుచూపు కరువు
ఏయే పుష్కర ఘాట్ కు ఎంతమంది భక్తులు వస్తారు ? వారి ప్రవేశం కోసం ఎక్కడ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలి ? స్నానం చేసిన అనంతరం వెళ్లే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ? అనే ముందస్తు వ్యూహం అధికారులు అనుసరించకపోవడం వల్లనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అర్థం అవుతోంది. కోటగుమ్మం పుష్కర ఘాట్ కు వెళ్లేందుకు..వచ్చేందుకు ఒకే మార్గం ఉండటం తొక్కిసలాటకు కారణమైందని యాత్రికులు పేర్కొన్నారు. ఓ పక్క పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన వారు రాకముందే అప్పటికే ఎదురు చూస్తున్నవారు నెట్టుకొని ముందుకురావడంతో ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి నెలకొందని యాత్రికులు తెలిపారు. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఇలాంటి చర్యలతో వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు వందల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం చిన్న విషయాన్ని మరిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్నానాలు చేయండి..పుణ్యం కట్టుకోండి అంటూ విపరీతంగా ప్రచారం చేసిన సర్కార్ స్నానం చేసి వెళ్లే మార్గంపై దృష్టి సారించలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రచారం ఘనం.. రక్షణ శూన్యం
/రిళిదావరి పుష్కరాల్లో నగరాన్ని సుందరీకరించడానికే ప్రభుత్వం మొగ్గు చూపిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా పుణ్యస్నానాలు చేయండి..పుణ్యం కట్టుకోండని అంటూ ప్రభుత్వం ప్రచారం చేపట్టిందని, కానీ భక్తులకు సరియైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. ఇటీవల జరిగిన పుష్కరాలు..కుంభమేళాల్లో అనుసరించిన విధానంపై ప్రభుత్వం దృష్టి సారించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలు ఏ రోజు వస్తుందో తెలిసిన ప్రభుత్వం కనీసంఅధ్యయనం చేసి, భక్తులు వస్తే ఎలా కంట్రోల్ చేయాలో నిర్ణయించుకోలేకపోయిందన్న భిప్రాయాలు వినిపిస్తున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తామన్న ఏపీ సర్కార్ పై యాత్రికులు మండిపడుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారని ప్రశ్నిస్తున్నారు. నీళ్లు ఎక్కడ అని నిలదీస్తున్నారు. ఉచిత నీరు అంటూ ఏర్పాటు చేసిన ఓ కేంద్రం వద్ద ట్యాంకు ఖాళీగా వెక్కిరించింది. తాము నీళ్లు లేకపోవడంతో ఇక్కట్లకు గురవుతున్నట్లు యాత్రికులు తెలిపారు. ప్రభుత్వం అది చేశా..ఇది చేశాం..అని గొప్పలు చెప్పి మోసం చేసిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సవిూక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరఘాట్‌కు సామర్థ్యానికి మించి భక్తులు ఒకేసారి రావటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఇతర ఘాట్‌లను కూడా భక్తులు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. పుష్కరాలకు వచ్చిన భక్తులంతా సంయమనం పాటించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. పుష్కరాల కంట్రోల్ రూం వద్ద ఆయన పరిస్థితిని సవిూక్షించారు. మృతుల సంఖ్యపై రకరకాల కధనాలు వస్తున్నాయి. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే మృతుల సంఖ్య ఇరవై దాటిందని కొందరు చెబుతున్నారు.కాగా గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించడానికి అవసరమైన అంబులెన్స్ సదుపాయం సరిగా లేకుండా పోవడం, క్యూలైన్లను నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సన్నద్దంగా లేకపోవడం వంటి వాటి వల్ల కూడా ప్రమాదం జరిగింది. వదంతులు నమ్మవద్దని అదికారులు భక్తులను కోరుతున్నారు.
తెలంగాణ సిఎం కెసిఆర్ సంతాపం
రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో అపశృతి చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 25 మంది భక్తులు మృతి చెందారు. భక్తుల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది అనుకోని ఘటన అని, ఊహించని ఘటన అని విచారం వ్యక్తం చేశారు.
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కామినేని
గోదావరి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతిచెందగా, పలువురు గాయపడ్డ ఘటనపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఒకే ఘాట్‌కు ఎక్కువ మంది రావటం వల్ల తొక్కిసలాట జరిగిందని… ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు.
సిఎం చంద్రబాబుదే బాధ్యత: వైకాపా
రాజమండ్రి లో పుష్కర ఘాట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు,దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు బాధ్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆర్భాటంగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ మేరకు రక్షణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. ఆ పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, అంబటి రాంబాబులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వందల కోట్లు ఖర్చు చేసి కూడా ఇంత దారుణంగా ప్రభుత్వం విఫలం చెందడం శోచనీయమని రాంబాబు అన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఘాట్ ల వద్ద సరైన సదుపాయాలు కల్పించకపోవడం, భక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలం చెందడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పుష్కరాల ఘాట్ ల వద్ద దారుణ పరిస్థితి ఉందని,నీరంతా మురికి మయంగా ఉందని ఆయన చెప్పారు.ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపటికి కూడా వైద్యసాయం అందించే పరిస్థితి లేకపోవడం ప్రభుత్వం ఎంత ఘోరంగా విపలం అయిందో తెలియచెబుతుందని వారు విమర్శించారు.
రాజమండ్రిలో పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై విపక్షం తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనలో దాదాపు 27 మంది మరణిండంపై నేతలు తీవ్ర ఆందోళన, ఆవేదన చెందారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బాధ్యతరాహిత్యమే తొక్కిసలాటకు కారణమని కాంగ్రెస్, వైకాపా తదితరపార్టీలు మండిపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే బాధ కలుగుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి,మంత్రులు వ్యక్తిగత ప్రచారం,ప్రతిష్ట కోసం ప్రయత్నం చేయడం తప్ప , ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని పిలుపు ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి, వ్యక్తిగత ఆరాధనకు వెళ్లి , ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చారని అన్నారు. అంతా తనకే ప్రచారం రావాలని బాబు తాపత్రపడడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. గతంలో చిన్న ఘటన జరిగినా ,రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని అన్నారు. నైతికత ఉంటే బాబు రాజీనామా చేయాలని అన్నారు. ఆరు గంటలకు ముహూర్తం పెడితే చంద్రబాబుకోసం మూడు గంటల సేపు జనాన్ని ఆపుతారా అని బొత్స ప్రశ్నించారు. మనిషి ప్రాణాలను పది లక్షల డబ్బుతో కొనడానికి చంద్రబబు ప్రయత్నిస్తున్నాడని, చనిపోయిన కుటుంబాల బాద్యత మొత్తం ప్రభుత్వం తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రచారం కోసం చూపిన శ్రద్ద సదుపాయాలపై ఎందుకు పెట్టలేదని అన్నారు. ప్రమాదం జరిగితే ఒక్క అంబులెన్స్ లేదా డాక్టర్లు, నర్సులు కనిపించలేదని, ఇదేనా ఏర్పాట్లు అని అన్నారు. గతంలో ఇలాంటి ఘటనల సమయంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన బాబు ఇప్పుడు అదే తనకు ఆపాదించుకుంటే మంచిదన్నారు. కటౌట్లకు పెట్టిన కలపను బ్యారికేడ్లకు ఉపయోగించి ఉంటే బాగుండన్నారు. 3 గంటల పాటు పుష్కరఘాట్ల వద్దకు రాకుండా జనాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రాజమండ్రి లో పుష్కర ఘాట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు బాధ్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. వందల కోట్లు ఖర్చు చేసి కూడా ఇంత దారుణంగా ప్రభుత్వం విఫలం చెందడం శోచనీయమని రాంబాబు అన్నారు. ఘాట్ ల వద్ద సరైన సదుపాయాలు కల్పించకపోవడం, భక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలం చెందడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.పుష్కరాల ఘాట్ ల వద్ద దారుణ పరిస్థితి ఉందని,నీరంతా మురికి మయంగా ఉందని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపటికి కూడా వైద్యసాయం అందించే పరిస్థితి లేకపోవడం ప్రభుత్వం ఎంత ఘోరంగా విపలం అయిందో తెలియచెబుతుందని వారు విమర్శించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత బాబుదేనని, ఆయన రాజీనామా చేసి నిజాయితీ చాటుకోవాలన్నారు. అంతా తానై రాజమండ్రిలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ ఘనటకు ఆయనదే బాధ్యతన్నారు. ప్రచార కండూతి కోసం బాబు భద్రతను విస్మరించి, మంత్రలను, అధికారులను విస్మరించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం వల్లే గోదావరి పుష్కరాలలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం, అసమర్థత వల్లే నిండు ప్రాణాలు పోయాయని పేర్కొన్నారు. తొక్కిసలాటలో మరణాలను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. బాబు ఇదేనా విూ పాలన అని ప్రశ్నించారు.
రాజీనామాతో చిత్తశుద్ది చాటుకోండి: చిరు, రఘువీరా
రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో ముప్పై మంది మరణించడంపై ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని అడిగినా ఆయన చేయరని,కాని ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలని చిరంజీవి అన్నారు. చంద్రబాబు ఈ ఘటనకు బాద్యత వహిస్తారా?లేదా అన్నది చెప్పాలని ఆయన కోరారు.గతంలో వైఎస్‌ను రాజీనామా చేయాలని కోరిన బాబు ఇప్పుడు తనకు అదే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే రాజమండ్రి ఘటన జరిగిందని కాంగ్రెస్ నేత చిరంజీవి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు చంద్రబాబు పూర్తి బాధ్యత వహిస్తారా లేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బాబును డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. పుష్కరాలకు విపరీతమైన ప్రచారం చేశారు. లక్షలాది మంది వస్తారని అంచనా వేశారు. మరీ ఏర్పాట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏర్పాట్లలో ఎందుకు బాబు విఫలమయ్యారని అడిగారు. పబ్లిసిటీ కోసం చూపించిన శ్రద్ధ ఏర్పాట్లలో చూపించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ చేతగానితనమే నిదర్శమన్నారు.కేవలం ప్రచారం కోసం, తనకే ఖ్యాతి దక్కాలన్న యావ తప్ప భద్తరను గాలికి వదిలేశారని అన్నారు. కాంగ్రెస్ బృందం రాజమండ్రికి వెళుతుందని , అక్కడ బాధితులను పరామర్శించి,పుష్కర ఏర్పాట్లను పరిశీలిస్తామని ఆయన అన్నారు. పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమని రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న పుష్కరాల్లో తప్పులు జరుగుతాయని ఊహించాం కానీ ఇంత పెద్ద ఘటన జరుగుతుందని ఊహించలేదన్నారు. సి.రామచందయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. అక్కడ కనీసం ఏలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, 14వ తేదీ నాటికి ఏర్పాట్లు కావని కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై తాము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన యనమల రామకృష్ణుడు..మరో మంత్రి నారాయణలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పచెప్పారని తెలిపారు. వీరు గాక ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ రావుకు కీలక బాధ్యతలు అప్పచెప్పారని తెలిపారు. వీరు ముగ్గురిని చంద్రబాబు జపాన్ పర్యటనకు తీసుకెళ్లడం జరిగిందని, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారని రఘువీరా విమర్శించారు. ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా వందల కోట్లు ఎక్కడ పోశారని అన్నారు. నిధులు మళ్లించారని అన్నారు. దీనికి బాధ్యత వహించి బాబు తోణం రాజీనామా చేయాలని అన్నారు. మొసలి కన్నీరు కార్చి ఘటననుంచి తప్పించుకోలురని అన్నారు. పుష్కర ఘాట్ కు, ఎన్.టి.ఆర్.విగ్రహానికి లింక్ పెట్టి పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడారు . పుష్కర ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు విగ్రహం పెట్టడం అపచారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్.టి.ఆర్.ను చంపిన పాపాన్ని కడుగుకోవడం కోసం రాజమండ్రి పుష్కరాల ఘాట్ వద్ద చంద్రబాబు ఆయన విగ్రహం పెట్టించారని, అందుకు గాను ఇరవై ఏడు మందిని బలి ఇచ్చారని రఘువీరా ఆరోపించారు.ఈ ఘటనకు చంద్రబాబు రాజీనామా చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమండ్ చేశారు. అధికారులను వారి పనిని వారు చేసుకోనివ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.