తల్లడిల్లిన తాడ్వాయి
వరంగల్ జిల్లాలో ”ఎన్‌కౌంటర్”
ఇద్దరు మావోయిస్టుల మృతి
విద్యాసాగర్‌రెడ్డి, శృతిలుగా గుర్తింపు
శృతి హైదరాబాద్‌లో ఎంటెక్ విద్యార్థిని
ఏటూరు నాగారం సెప్టెంబర్ 14(జనంసాక్షి):
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ సమీపంలోని అటవీప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. వెంగలాపూర్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ దళాలలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝూ ధ్రువీకరించారు.మావోయిస్టుల కోసం వెంగలాపూర్ అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. 2 నెలలుగా వరంగల్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులు నిర్థరించారు. నిన్న ములుగు మండలం మల్లంపల్లిలో మావోయిస్టులు జేసీబీని దహనం చేశారు. 20రోజుల క్రితం మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ సభాపతి మధుసూదనాచారిని హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడపత్రికలు విడుదల చేశారు.
మృతులు వీరే…
ఎదురు కాల్పుల్లో మృతిచెంది మావోయిస్టులను శృతి(24), విద్యాసాగర్‌రెడ్డి(33)గా గుర్తించారు. శృతి అలియాస్ మహిత హైదరాబాద్‌లో ఎంటెక్ ( ఇంజినీరింగ్ ), చదువుతున్నట్లు తెలుస్తోంది. శృతి ఆమె తండ్రి హైదరాబాద్‌లోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శృతిచ విద్యాసాగర్‌రెడ్డి దామోదర్ దళంలో క్రియాశీలక సభ్యులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో కిట్‌బ్యాగ్, ఆయుధాలు, క్లైమోర్ మైన్‌లు, మందులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొనసాగుతున్న ఎదురుకాల్పులు
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య 5గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. బయ్యక్కపేట అడవిలో మావోయిస్టులు మందుపాత పేల్చి తప్పించుకునేందుకు యత్నించారు. కేకే డబ్ల్యూ కారదర్శి దామోదర్ దళం తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు దామోదర్ దళాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు పోలీసు వర్గాలు పేర్కోన్నాయి.