తీగలాగితే డొంక కదులుతోంది…

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెట్‌లోని చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకువస్తోంది. సోమరుల ఆటకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చి పక్కా మాస్‌ మసాలా గేమ్‌గా మార్చి కాసుల పంట పండిస్తోంది బీసీసీఐ. ఐసీసీని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ముందుకు సాగుతోంది. ఈక్రమంలోనే ఆరేళ్ల క్రితం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పేరుతో ఓ నయా కాసుల పందేరానికి తెరతీసింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల పేర్లతో జట్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోపెట్టింది. ఆయా ప్రాంచైజీలనే ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసుకోవాలి. ఇలా ఒక్కో ప్రాంచైజీ తరఫున తలపడే తుది జట్టులో నలుగురు విదేశీ, ఏడుగురు స్వదేశీ క్రికెటర్లు ఉండాలనే నిబంధన పెట్టింది. అంతక్రితం వరకూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కే పరిమితమైన ఎందరో మట్టిలో మాణిక్యాలు ఐపీఎల్‌ పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది అక్షరాల సత్యం. అదే సమయంలో యువ, వర్ధమాన క్రికెటర్లలో క్రీడాస్ఫూర్తి స్థానే లాభాపేక్ష పెరిగిపోయింది. ఐపీఎల్‌ వల్ల కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిన డబ్బు, క్రీడా మైదానంలో వారు చూపే ప్రతిభ కొద్ది కాలానికే వారిని సెలబ్రిటీలుగా మార్చేశాయి. ఒప్పుడు ఎండలో చెమటలు క్కుతూ మైదానంలో శ్రమించిన క్రికెటర్లు అనతికాలంలో కోట్లకు పడగలెత్తారు. బ్రిటిషర్లు క్రికెట్‌ను జెంటిల్మన్‌ గేమ్‌గా పిలుచుకుంటారు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఇంగ్లండ్‌ తన మానస పుత్రిక క్రికెట్‌ మాత్రం విశ్వవ్యాపితం చేయలేకపోయింది. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కరేబియన్‌ ప్రాంతాలకు మాత్రమే క్రికెట్‌ పరిమితమైపోయింది. క్రికెట్‌కు గ్లామర్‌ టచ్‌ వచ్చాక అరబ్‌ దేశాల్లోకి విస్తరించినా నిలదొక్కుకోలేకపోయింది. మరోవైపు అగ్రదేశాలేవి క్రికెట్‌ను ఆదరించలేదు. అయితే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో క్రికెట్‌ ఆధరణ లభించడంతో క్రికెటర్లకు బ్రాండ్‌ వ్యాల్యూ పెరిగింది. దీనిని సొమ్ము చేసుకోవాలని ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు బీసీసీఐ ఐపీఎల్‌కు తెరతీసింది. అప్పటి వరకూ జెంటిల్మన్‌ గేమ్‌గా చెప్పుకునే క్రికెట్‌ను చీట్ల పేకలా మార్చేసింది. మైదానంలో ఆడే ఆటకు స్టేడియం బయట ధర కట్టడం మొదలైంది. అభిమానుల ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు అండర్‌ వరల్డ్‌ మాఫియా రంగప్రవేశం చేసింది. దానికి క్రికెటర్లు, క్రికెట్‌ బోర్డు పెద్దల సన్నిహితులు, భారతీయ సినిమా ప్రముఖులు దాసోహమైనట్లుగా ఆధారాలు బయటపడుతున్నాయి. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌, చండిలా, చవాన్‌ పోలీసులకు చిక్కారు. మైదానంలో బౌలింగ్‌ చేస్తూనే శ్రీశాంత్‌ ప్రేక్షకుల్లో ఉన్న బుకీకి సైగల ద్వారా సమాచారం చేరవేశాడు. 20 పరుగులకు పైగా పరుగులిచ్చేలా బౌలర్‌ ఓవర్‌ వేస్తే రూ.60 లక్షలు చెల్లించేలా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇంతకాలం మ్యాచ్‌ఫిక్సింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ను ఎవరో బయటి వ్యక్తులో, మాఫియానో ఆపరేట్‌ చేస్తున్నారని అనుకునేవారంత. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ బట్టబయలు కావడంతో బీసీసీఐ లోపలి వ్యక్తుల ప్రమేయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ బంధువు పోలీసులకు చిక్కాడు. దీంతో ఫిక్సింగ్‌ మూలాలు బీసీసీఐలోనూ ఉన్నాయనే అనుమానాలు ప్రబలమవుతున్నాయి. దీనిపై విచారణ వేగవంతవమవుతున్నాకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలీవుడ్‌ మాజీ నటుడు ధారాసింగ్‌ తనయుడు విందూ ధారాసింగ్‌ అరెస్టుతో ఫిక్సింగ్‌కు బాలీవుడ్‌తో లింకులు తేటతెల్లమవుతున్నాయి. ఐసీసీ కేంద్ర కార్యాలయం దుబయి కేంద్రంగానే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వేళ్లూనుకుపోయింది. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్‌ను ఫిక్సింగ్‌ భూతం పట్టిపీడిస్తుంది. ఐపీఎల్‌లో ఓవర్‌కు ఇన్ని పరుగులిస్తే ఇంత, సిక్స్‌ కొడితే ఇంత, బౌండరీ కొడితే ఇంత, ఈ ఆటగాడు ఆడితే ఇంత, ఔటైతే ఇంత అని ముందుగానే భేరం కుదిర్చి వారికి సన్నిహితుల ద్వారా డబ్బులు చేరవేస్తున్నారు. అసలు ప్రవేట్‌ వ్యక్తులు ఐపీఎల్‌ నిర్వహించడంతోనే అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వమే ఐపీఎల్‌ నిర్వహణకు పూనుకోవాలి. అవినీతి మకిలీ అంటుకున్న ఐపీఎల్‌ను రద్దు చేయాలని కొందరు వ్యక్తులు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు నమోదు చేశారు. కోర్టులు వాటిని విచారణకు స్వీకరించాయి. క్రీడల్లో ఆటగాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో పోటీపడాలి. క్రీడా స్ఫూర్తిని చాటాలి. లేకుంటే ఫిక్సింగ్‌లాంటి వ్యవహారాలతో క్రీడా స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది.