తెలంగాణను ఊహించని అభివృద్ధి చేస్తాం

C
– బలమైన పునాదులు వేస్తున్నాం

– ప్రతిపక్షాలది అనవసరమైన రాద్దాంతం

– అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

– శాసనసభ,మండలి నిరవధికవాయిదా

హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనంసాక్షి): తెలంగాణలో సంక్షేమకార్యక్రమాలను గతంలో ఎన్నడూ చేపట్టనంతగా చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే రెట్టింపు నిధులు వెచ్చించామన్నారు.  పెద్ద మనుసుతో హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నమని  ఇక కాలేజీ హాస్టళ్లకు కూడా సరఫరా చేస్తామని అన్నారు. శాసన సభ సమావేశాల్లో సంక్షేమంపై సభ్యుల ప్రశ్నలకు  సీఎం సమాధానమిస్తూ గతంలో ఎవరూ ఊహించని అభివృద్ధిని చేసి చూపించామని అన్నారు. మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను అమలు చేస్తున్నమని తెలిపారు. ప్రజల అవసరాలు తెలుసుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణకు అసలైన పునాది ఇప్పుడే వేస్తున్నామని అన్నారు. బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతిని ఇస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్బిణీలకు ప్రతీ రోజూ పాలు, గుడ్లు ఇస్తున్నమని అన్నారు. ఆర్థిక స్థితిగతులు ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కాలేదన్న సీఎం ఫైనాన్సియల్‌ ట్రెండ్స్‌ బాగున్నాయి కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. వచ్చే పంచాయతీరాజ్‌ ఎన్నికల నాటికి తండాలన్నీ గ్రామపంచాయతీలు అవుతాయన్నారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల అనేక సమస్యలకు పరిష్కారాలు వెతికినట్లు  చెప్పారు. వక్ఫ్‌ బోర్డు, మైనారిటీ వెల్ఫేర్‌లో తగినంత స్టాఫ్‌ లేదని..త్వరలో సిబ్బందిని భర్తీ చేస్తామని హావిూనిచ్చారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్టాటించారు. రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.5,036కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. దళితుల కోసం రూ.8,089 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.  మైనారిటీల సంక్షేమం కోసం రూ.1,105కోట్లు, న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100కోట్లు, జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.10కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ.2,037 కోట్లు కేటాయించినమని వెల్లడించారు. అలాగే రూ.4,055 కోట్లతో 65వేల ఇళ్లు నిర్మించబోతున్నమని ఉద్ఘాటించారు. గతంలో సంక్షేమానికి 13,572 కోట్లు ఖర్చు చేస్తే ఇపుడు 33,986 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇక ఏనాడూ రైతుల, ప్రజల సంక్షేమం పట్టని విపక్షాలు 15 నెలల కాలంలోనే తామేదో అన్యాయం చేశాయన్న విధంగా యాగీ చేస్తున్నాయని సిఎం మండిపడ్డారు. ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని పాలన చేసిందే కాంగ్రెస్‌, టిడిపిలని అన్నారు. వారి పాలనా కాలంలో మంచి చేస్తే తాము ఖరాబు చేశామా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాము చేస్తున్న కృషిని అబినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంతవరకు సబబని అన్నారు.

పద్నాలుగు సంవత్సరాలపాటు సుదీర్ఘ పోరాటం తెలంగాణ కోసం చేశామని , మొత్తం పదిహను నెలలు మినహా మొత్తం కాలం అంతా కాంగ్రెస్‌ టిడిపిలే పాలన చేశాయని, తాము వచ్చిన ఈ పదిహేను నెలల్లోనే పాడు చేశామా అని కెసిఆర్‌ అన్నారు. విపక్షాలు ఎందుకు యాగి చేస్తున్నాయని ఆయన అన్నారు. తాము స్వల్పకాల,మద్యకాల, దీర్ఘకాల పరిష్కారాల కోసం ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఇరిగేషన్‌ రంగంలో మార్పుల కోసం తెల్లవారు జాము మూడు గంటల వరకు కూడా అదికారులతో కూర్చుని చర్చలు జరుపుతున్నానని ఆయన అన్నారు. కెసిఆర్‌ కంఠంలో ప్రాణం ఉండగా తప్పు జరగనివ్వబోనని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర ఇప్పుడే ప్రారంభం అయిందని,ఇప్పుడు పునాది వేస్తున్నామని, అర్దం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప ,చెడగొట్టబోనని అన్నారు. తెలంగాణ అబివృద్ది మాత్రమే తన లక్ష్యమని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఒకేసారి ఎనిమిది వేల కోట్లు మంజూరు చేసే పరిస్తితి ఉంటుందా?అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు హద్దు,పద్దు ఉండాలి కదా అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. వీళ్లందరూ రైతులను కోటీశ్వరులను చేస్తే,తాము చెడగొట్టామా అని ఆయన అన్నారు. వీళ్ల అసమర్ధ, అవివేక పాలన వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని కాంగ్రెస,టిడిపిలపైఆయన మండిపడ్డారు. సభ జరగనివ్వబోమని విఫక్షాలు అడ్డుపడ్డాయని ఆయన అన్నారు. తాము వారిని గెంటి వేయలేదని, వారే గెంటి వేయించుకున్నారని అన్నారు. ప్రాజెక్టులపై వారి బండారం బయటపడుతుందని సభను జరగనివ్వకుండా చేయడానికి

ప్రయత్నించారని కెసిఆర్‌ ఆరోపించారు. కరెంటు సమస్యలు ఇప్పుడు ఎందుకు లేవని ఆయన అన్నారు.ఒక మంచి మాట కూడా వారు చెప్పలేదని,కాని ఇప్పుడు ఎవరి భరోసా యాత్ర కు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.విూ ఏభై ఏళ్ల నిర్వాకం చెబుతారా అని అడిగారు. ఇరిగేషన్‌ లో విప్లవం చూడబోతున్నారని ఆయన చెప్పారు. అన్ని విషయాలపై వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడానికి సిద్దమవుతున్నామని అన్నారు. తాను ఈ కృషి చేస్తుంటే ఒక మహిళా ఎమ్మెల్యే సినిమా చూపిస్తానని అన్నారని ,దానిని వారి విజ్ఞతకే వదలిపెడుతున్నానని అన్నారు. పిచ్చి ప్రచారాలకు ప్రజలు గందరగోళం పడవద్దని ఆయన అన్నారు. శాసనసభలో అన్ని చర్చలు జరిగాయని అన్నారు. శాసనసభలో ప్రజెంటేషన్‌ ఇద్దామని అనుకున్నామని, విఫక్షాలు లేనందున దానిని పదిహేనో తేదీకి వాయిదా వేస్తున్నామని, అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రజెంటేషన్‌ ఇస్తామని అన్నారు. శాసనసభను నిరవధిక వాయిదా వేయాలని ఆయన స్పీకర్‌ మదుసూదనాచారిని కోరారు.

అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు.  శాసనసభ స్పీకర్‌ మధుసూధనాచారి ముఖ్యమంత్రి కేసీఆర్‌,ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్‌ ఒవైసీ ప్రసంగాల తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభ  సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించిన సభ్యులందరికీ స్పీకర్‌ ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కూలంకషంగా సభ్యులకు, ప్రజలకు తెలియజేశారు. గత నెల 23న శానసమండలి సమావేశాలు ప్రారంభమైన విషయం విదితమే. మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. మండలి సమావేశాల్లో రైతుల సమస్యలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, మార్కెటింగ్‌, ఇరిగేషన్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు వివరంగా సమాధానం ఇచ్చారు. మంగళవారం  మండలి ఉపాధ్యాక్షుడిగా నేతి విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. అనంతరం ఉపాధ్యాక్షుడిగా నేతి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 10వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండగా విపక్షాల సస్పెన్షన్‌ కారణంగా మూడురోజుల ముందుగానే సమావేశాలను ముగించడం విశేషం.