తెలంగాణలో సినిమా, స్పోర్ట్స్‌ సిటి

1

రాచకొండ అనువైనది – సీఎం కేసీఆర్‌

 

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలంగాణలో సినిమా సిటీ,స్పోర్ట్స్‌ సిటీలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అందుకు రాచకొండ ప్రాంతం అనువైందని సీఎం వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి,. సీఎస్‌ రాజీవ్‌ శర్మతో కలిసి రాచకొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.దాదాపు 31 వేల ఎకరాలకు పైగా భూమి ఈ ప్రాంతంలో ఉందని , తెలంగాణలో పరిశ్రమలు,సంస్థలు,విద్యాలయాలు స్థాపించడానికి అనువైందని చెప్పారు. కాలుష్యం వెదజల్లని సంస్థలన్నింటినీ ఇక్కడే నెలకొల్పాలని సీఎం నిర్ణయించారు. నూతనంగా ఏర్పడ్డ రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో చిత్ర నగరిని నిర్మించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను సీఎం సోమవారం పరిశీలించారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్‌ రాచకొండ గుట్టలకు చేరుకుని నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో రాచకొండ గుట్టలను ఏరియల్‌ సర్వే చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రాచకొండ గుట్టల ఫోటో గ్యాలరీని సీఎం పరిశీలించారు. రాచకొండ గుట్టల పర్యటన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. రాచకొండ గుట్టల్లో చిత్ర నగరిని నిర్మించడం సంతోషంగా ఉందని ఇరు జిల్లాల సరిహద్దు ప్రజలు తెలిపారు.