తెలంగాణే.. ప్రత్యామ్నాయం లేదు : టీ కాంగ్రెస్‌

కాస్త చూడండి.. సమైక్యాంధ్ర కొనసాగించండి
శైలజానాథ్‌
హైదరాబాద్‌, జూలై 1 (జనంసాక్షి) :
తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు, వెంటనే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని టీ కాంగ్రెస్‌ నేతలు సోమవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసి కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని కోరుతూ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ సాధన సభలో చేసిన తీర్మానం ప్రతిని అందించారు. కోర్‌కమిటీకి సీఎం, పీసీసీ అధ్యక్షుడిని మాత్రమే పిలుస్తామని దిగ్విజయ్‌ చెప్పడంతో తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డెప్యూటీ సీఎంతోపాటు మరో వ్యక్తిని పిలవాల్సిందేనని తేల్చి చెప్పారు. సీఎం, పీసీసీ చీఫ్‌ సీమాంధ్రులే అయినందున తెలంగాణకు ప్రాతినిథ్యం లేకుంటే తమ వాదనలు లేకుండా పోతుందని పేర్కొన్నారు. దీంతో దిగ్విజయ్‌ సింగ్‌ తప్పనిసరిగా ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మంత్రి సారయ్య మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పామన్నారు.  తెలంగాణరాకుంటే వెనక్కి తగ్గేదిలేదన్నారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రతిఒక్కరు చెపుతున్నందున సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరామన్నారు. 2004లో, 2009లో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పామని గుర్తుచేశామన్నారు. హైకమాండ్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నందన్న సంకేతాలున్నాయన్నారు. ఇప్పటికే జాప్యం జరిగిందన్నారు. వరంగల్‌ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, తెలంగాణపై పోరాటాలు, పార్లమెంట్‌లో ప్రకటన, సీఎంపిలో చేర్చిన అంశం, మేనిఫెస్టోలో క్రోడికరించిన అంశాలను దిగ్విజయ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యను సారమస్య పూర్వకంగా పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. చిన్న రాష్టాల్రతోనే అభివృద్ది సాధ్యం అవుతుందని అంబేద్కర్‌ చెప్పినట్లు చేయాలని కోరామన్నారు. తెలంగాణ కాకుండా ఇంకే ప్రతిపాదనను స్వీకరించేందుకు సిద్ధంగా లేమన్నారు. తెలంగాణను ఏశక్తి ఆపలేదన్నారు.
మరో వైపు దిగ్విజయ్‌ని కలిసిన సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరారు. సమైక్యాంధ్రకు ఎక్కువ మంది ప్రజల మద్దతు ఉన్నదని దానిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మంత్రులు శైలజానాథ్‌, టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్రపై తమ వాదన బలంగా వినిపించామని చెప్పారు. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తామ స్పందన ఉంటుందన్నారు.