తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే

– ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస ప్రభుత్వం విఫలం

– 2019లో అధికారం కాంగ్రెస్‌దే

– టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌, మే2(జ‌నం సాక్షి) : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీదే అని టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని తెలంగాణ చౌక్‌లోసోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కహావిూని అమలు చేయకుండా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అనే నినాదం కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని పొన్నం ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అమలు కాని హావిూలతో కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకం పేద రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని అన్నారు. కేవలం పెద్ద రైతులకే రైతుబంధు పథకం ఫలాలు అందాయని, చిన్న రైతులకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదన్నారు. కౌలు రైతులకు రైతుబంధు పథకాన్ని వెంటనే వర్తింప జేయాలని పొన్నం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతురాజ్యం తెస్తుందన్నారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్‌ కులాలు, మతాలను విడదీసి తన పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ విధానం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అన్ని వర్గాలు, మతాలు, కులాలు సంతోషంగా జీవనం సాగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్‌తో పాటు రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఆరెపల్లి మోహన్‌ పాల్గొన్నారు.

————————