తెలంగాణ ఇచ్చేయండి


రాయల తెలంగాణ వద్దు : బైరెడ్డి
హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) :
తెలంగాణ ఇచ్చేయండి.. రాయండి తెలంగాణ మాత్రం వద్దని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖరారు కావడమేకాక రాయలసీమను విభజిస్తున్నారని తేలాక ఆయన ఇందిరాపార్క్‌లో 52 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు చెందిన 52మంది ఎమ్మెల్యేలున్నారని, వారికి చిత్తశుద్ధి, ప్రాంతంపై అభిమానం లేదన్నారు. రాయలసీమకు చెందిన 52 మంది నేతల తీరుకు వ్యతిరేకంగాను, రాయలసీమను విభజిస్తే వచ్చే పరిణామాలను రుచిచూపించేందుకే తానీ దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. కేంద్రం రాయలసీమను ముక్కలుగా చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన విరుచుకు పడ్డారు. రాయలసీమను ఆడుకునే పరిస్థితులు రావడం వెనుక కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, జగన్‌లే కారణమన్నారు. రాయలసీమ గూర్చి ఒక్కరోజు కూడా నోరు మెదపక పోవడంతోనే  దాపురించిందన్నారు. ఇటీవలే కేసిఆర్‌ కూడా చేసిన వ్యాఖ్యలపై కూడా చీమునెత్తురు లేని రాయలసీమ నేతలు ఎందుకు నోరు మెదపలేదన్నారు. కర్నూలు, అనంతపూరులను కలిపితే మరో కాశ్మీర్‌లా మారుతాయని ప్రకటించినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్‌ వచ్చి తమతో కాకుండా తెలగాణాకు చెందిన కోదండరామ్‌తో రాయలసీమ విభజనపై చర్చిస్తారా అంటూ ఎంత దైర్యం కావాలంటూ దిగ్విజయ్‌పై నిప్పులు చెరిగారు. అసమర్ధ దద్దమ్మలుగా ముగ్గురు హీరోలనుకుంటున్న వారి వల్లే సమస్యంతా  ఉత్పన్నం అవుతుందన్నారు. హైదరాబాద్‌ వచ్చి మరోసారి దిగ్విజయ్‌ పంచాయితీ పెట్టారని ఆరోపించారు. తమతో పెట్టుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాయలసీమను కోస్తాలోనో, తెలంగాణాలోనో కలిపేయాలనుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. తెలంగాణా ఇచ్చుకుంటే ఇచ్చుకోండి మా జోలికి మాత్రం రావద్దంటున్నారు. సోనియాగాంధీపై కూడా విరుచుకు పడ్డారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. అసలు సోనియాగాంధీ ఏమనుకుంటుంది ఇటలీనా, యూరఫ్‌గా బావిస్తున్నారా, రాయలసీమను ముట్టుకుంటే అగ్నితోచలగాటం ఆడినట్లే అవుతుందని రుచి చూపిస్తామన్నారు. తమ ప్రాంతంలో 52మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్లే తాను 52గంటలపాటు దీక్షను చేపడుతున్నానన్నారు. ఆతర్వాత విరమించి ప్రజల్లకివెల్లి ఉద్యమాలు చేస్తామన్నారు. ఇంటి దొంగలుగా తమ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి స్థాయి నాయకులను ఇంటికి పంపిచే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. రాయల సీమ విడిపోతే మాత్రం ఈసారి ఉన్నవారందరిని, ముగ్గురు దద్దమ్మలతో కలుపుకుని ఇంటికే పరిమితం చేస్తామని హెచ్చరించారు. తమ ప్రజలను దిగ్విజయ్‌ సింగ్‌ అవమాన పరిచాడన్నారు. కాంగ్రెస్‌ ఆయారాంలను, గయారాంలను పంపిస్తూ రాష్ట్రంలో రెచ్చగొడుతుందని ఆరోపించారు. గతంలో ఉన్నదాన్ని ఉండనీయకుండా చేసిన పరిణామాల వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాయలసీమలో ఆత్మగౌరవం ఉందన్నారు. రాయల తెలంగాణాకు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. తెలంగాణా రాష్ట్రం ఇచ్చుకోవచ్చన్నారు. రాయలతెలంగాణా ప్రకటిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా 52మంది పదవుల్లో ఉండడానికి వీల్లేకుండా  అడ్డుకుంటామన్నారు.