తెలంగాణ ఉద్యమాన్ని..

 

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి:
తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆరోపించారు. ప్రభుత్వం తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు నిరసనగా అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌వద్ద తెలంగాణ రచయితలు, పాత్రికేయులు, విద్యార్థుల వేదిక నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చుక్కా రామయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం తెలుగు మహాసభలను ఆర్భాటంగా నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నా ప్రభుత్వాలు పేరు కోసం తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగు భాషను ఏం అభివృద్ధి చేశారని తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని

చుక్కా ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు రాజకీయ లబ్ధికోసమే సభలు ఉపయోగపడతాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఎంతమాత్రం ఉపయోగపడవని
అన్నారు. తెలుగు మహాసభలు ముగిసిన వెంటనే తెలుగు భాష గురించి ప్రభుత్వం మరిచిపోతుందని ఎద్దేవా చేశారు. 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో అన్ని వర్గాలు తెలంగాణకు అను కూలంగా నిర్ణయం తెల పాల ని చుక్కా రామ య్య కోరారు. కేంద్రప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వాలన్న ఉద్దేశం లేనందునే అఖిలపక్ష సమావేశం పేరుతో నాటకాలు ఆడుతున్నదని చుక్కా రామయ్య అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణపై తన అభిప్రాయం తెలపకుండా ఇతర పార్టీల అభిప్రాయాలను కోరడం కాంగ్రెస్‌కు సరికాదని అన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రాంతాల మధ్య విభజన సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్న వారి కలలు నెరవేరబోవని చుక్కా స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా వారి ఆటలు సాగబోవని చుక్కా రామయ్య హెచ్చరించారు. దీంతో పాటు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపట్టిన జేఏసీ నేతలు, ఇతర ప్రజా సంఘాలు ర్యాలీగా వచ్చి అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.