తెలంగాణ కోసం బాబు ఎందుకు ఉద్యమించరు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం మహానాడులో తీర్మానం చేశామంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల పక్షాన ఎందుకు ఉద్యమించరు? అంటే ఆ పార్టీ నుంచి సమాధానమే రాదు. తెలంగాణ కోసం ఈ పది జిల్లాల నాయకులే ఎందుకు ఉద్యమించాలి, వారే ఎందుకు మాట్లాడాలి? పార్టీ అధినేత ఎందుకు స్పందించరు? అని అడిగితే కనీసం సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు. తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలంగాణపై తీర్మానించిందని గొప్పగా చెప్పే తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు తమ అధినేతతో ప్రజల పక్షాన పోరు చేసేలా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది జవాబు లేని ప్రశ్న. టీడీపీకి రాజకీయ తీర్మానాలు చేసి విస్మరించడం కొత్తకాదు. ఇలాగే 2008లో నిర్వహించిన మహానాడులో తెలంగాణపై తీర్మానించింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కోసమే ఏర్పడిన టీఆర్‌ఎస్‌తో జట్టుకట్టింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్‌ఎస్‌తో కలిసి మహాకూటమిగా ఎన్నికల్లో పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ అత్యధిక స్థానాలు సాధించింది. కొన్నిచోట్ల సంకీర్ణ ధర్మాన్ని విస్మరించి రెబల్‌గా పోటీకి దిగిన తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్నికలు ముగిసిన ఆరునెలల్లోనే టీడీపీ తన తీర్మానాన్ని బుట్టదాఖలు చేస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా మారింది. స్వయంగా టీడీపీ అధినేత తెలంగాణ వ్యతిరేక చర్యలను ప్రోత్సహించాడు. ఆయన రాజీనామా చేయమంటేనే తాము ముందుకువచ్చామని తర్వాతికాలంలో ఆయనతో విభేదించిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు మీడియా ముఖంగా చెప్పారు. దీనిని టీడీపీ నేతలు ఖండిరచినా అందులో నిజముందని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే 2009 తర్వాత తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి ధరావత్తు కూడా దక్కకుండా చేశారు. బాబు వైఖరిని నిరసిస్తూ ఇద్దరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా టీడీపీ వైఖరిలో మార్పురాలేదు. తెలంగాణ కోసం పోరాడుతున్నవారిపై ఎదురుదాడి చేసే టీ టీడీపీ నాయకులు ఇప్పుడు తాజాగా మహానాడు తీర్మానాన్ని అడ్డుపెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక రాష్ట్రం లక్ష్యంగా జరిగే ఉద్యమాల్లో పాల్గొనాలి. కానీ ఏ ఒక్క రోజూ తెలంగాణ కోసం చంద్రబాబు మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన మట్టుకు తెలంగాణ ఎన్నికల అంశం. ఎన్నికల్లో ఓట్లు కురిపించే అంశం. ఇందుకోసం ఎన్నికల ముందు ఓ తీర్మానం చేసి పారేస్తే పోతుంది అనేది ఆ పార్టీ భావన. 2009 డిసెంబర్ 10న ఉదయం పూట మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తీరును చూసిన తెలంగాణ ప్రజలు ఈయనకా తాము ఓట్లేసి గెలిచింది అని నివ్వెరబోయారు. అర్ధరాత్రి ఎవరిని అడిగి తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారంటూ బాబు హూంకరించిన తీరుతో ఆయన నైజమేంటో తేటతెల్లమైంది. అంతకు మూడు రోజుల ముందు అధికార కాంగ్రెస్ తెలంగాణపై తీర్మానం చేయకుంటే తామే అసెంబ్లీలో ప్రైవేటు తీర్మానం తీసుకువస్తామని చెప్పాడు. అప్పటి సీఎం రోశయ్య అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటు చేసి తీరాల్సిందేనని పట్టుబట్టాడు. సరిగ్గా మూడు రోజుల తర్వాత మొత్తంగా అడ్డం తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకున్నాడు. తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్ణాటకకు చెందిన వీరప్పమొయిలీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టేందుకు కుట్రలు పన్నారంటూ గుడ్లిరిమారు. దక్షిణభారత దేశంలో అతిపెద్దదైన ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే తమ పబ్బం గడుపుకోవచ్చనే వారిద్దరూ కుట్రకు పూనుకున్నట్లు చాలా విచిత్రమైన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 42 మంది ఎంపీలతో ఏదో పొడిచేయొచ్చు అన్నట్లుగా బీరాలు పలికాడు. తాను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నప్పుడు ఏదేదో చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఆరోజుల్లో టీడీపీ నాయకులు మంత్రులు కావడం మినహా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనే విషయాన్ని విస్మరించాడు. తాను తెలంగాణకు అనుకూలమని విస్మరించిన విషయాన్ని తొక్కిపెట్టి పొరుగు రాష్ట్రాల వారిపై దుమ్మెత్తిపోస్తూ తమ పార్టీకి ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజలను వంచించాడు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో 2008 మాదిరిగానే మరో ఓ బూటకపు తీర్మానాన్ని చేయించాడు. ఇప్పుడు టీడీపీ చేయాల్సింది తీర్మానాలు కాదు చంద్రబాబు రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు కేంద్రస్థాయిలో తెలంగాణకు అనుకూలమైన పార్టీలతో సంప్రదింపులు జరిపి పార్లమెంట్ వేదికగా సర్కారుపై ఒత్తిడి పెంచాలి. కానీ ఇవేవి చేసేందుకు బాబు అంగీకరించరు. అంతెందుకు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే సీమాంధ్ర నేతలపై చర్యలు తీసుకోరు.. కనీసం వారిని హెచ్చరించరు కూడా. బీజేపీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ అగ్ర నేతలంతా అందుకు కట్టుబడ్డారు. సీపీఐ నేతలు అలాగే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఒక్క టీడీపీ అధినేత మాత్రమే బూటకపు తీర్మానాలతో పొద్దుపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది టీడీపీ చిత్తశుద్ధిని ప్రశ్నించేదే కాని తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేది ఏమాత్రం కాదు.