తెలంగాణ ముస్లింలకు రంజాన్‌ తోఫా

C
– ఐదు వేల మస్జీద్‌లలో పనిచేసే ఇమామ్‌లకు ప్రతి నెల 1000 భృతి

– పండుగ కోసం 26 కోట్ల బడ్జెట్‌

– పదివేల మస్జీద్‌లలో ధావతే ఇఫ్తార్‌

హైదారబాద్‌,జులై2(జనంసాక్షి):

రంజాన్‌ సందర్భంగా తెలంగాణ సర్కార్‌ ముస్లింలకు తోఫా ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించడమే గాకుండా, తొలిసారిగా అధికారికంగా రంజాన్‌ పండగను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా రంజాన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రెండు లక్షల మంది పేద ముస్లింలకు బట్టలు కొనుగోలు చేసుకునేందుకు ఐదు వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని  ప్రకటించారు. అలాగే రంజాన్‌ రోజున పేద ముస్లింలు 1.95లక్షల కుటుంబాలకు భోజన సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఇమామ్‌ లకు నెలకు వెయ్యిచొప్పున వేతనం కూడా ఇస్తామని ఆయన అన్నారు. రంజాన్‌ సందర్భంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పండగను ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈనెల 8న నిజాం కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 100 మసీదుల్లో దావత్‌- ఏ-ఇఫ్తార్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్షా 95వేల పేద ముస్లిం కుటుంబాలకు దస్తులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్లు జిల్లాల్లోనూ ఇఫ్తార్‌ విందులు నిర్వహిస్తారని తెలిపారు. 5వేల మసీదులలో పనిచేసే ఇమాంలు, మౌజన్‌లకు రూ.1000 భృతి ఇస్తామన్నారు. రంజాన్‌ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ రంజాన్‌ ఏర్పాట్లపై సవిూక్ష చేస్తారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక మసీదు వద్ద ఇప్తార్‌ విందు నిర్వహిస్తామని అన్నారు. బట్టలకు తొమ్మిది కోట్లు, భోజనాలకు నాలుగు కోట్ల ఖర్చు అవుతాయని కెసిఆర్‌ వివరించారు. మత సామరస్యానికి ,తెలంగాణ సంస్కృతికి అద్భుతమైన నిదర్శనంగా ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ ఇఫ్రార్‌ విందుకు టర్కి, సౌదీ అరేబియా ఇతర దేశాల అంబాసిడర్లను కూడా ఆహ్వానిస్తున్నామని అన్నారు.