తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది లండన్‌. కానీ, లండన్‌లోనే రాబిన్‌ హుడ్‌ సినిమా పాత్ర కాదు. చరిత్ర పురుషుడని అక్కడి వారిలోనే చాలా మందికి తెలియదు. ఇదంతా రాబిన్‌ హుడ్‌ సినిమాను మనలో కూడా చాలా మంది ఆ సినిమాను చూశారు కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ, మన దగ్గర కూడా చరిత్ర పుటల్లో చెరిగిపోయిన ఓ ‘రాబిన్‌ హుడ్‌’ ఉన్నాడు. ఇతడి చరిత్ర కనీసం సినిమాగా కూడా రాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి పరిధిలోని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా అతడి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ, ఆ పిల్లలకు కూడా వాళ్లు చెప్పుకుంటున్న కథల్లోని రాబిన్‌ హుడ్‌ వారి కన్నా ముందు తరాల వారి మధ్య నడియాడాని తెలియదు. ఏదో బతికున్న, వందకు చేరువగా ఉన్న ముసలోళ్లకు తప్పితే. ఇంతగా చెప్పుకున్నాక అతని పేరు, అతడి కొంత చరిత్ర గురించి తెలుసుకోవాలన్న కుతూహలక ఎవరికైనా కలుగుతుంది. మన తెలంగాణలోని మన మహబూబ్‌నగర్‌ జిల్లాలో పుట్టిన, మన రాబిన్‌ హుడ్‌ పేరు ‘మియాసావు.’ ఇక మియాసావు గురించి చెప్పాలంటే.. ఇతను పుట్టింది ఇప్పటి మహబూబ్‌నగర్‌ జిల్లా నాటి వనపర్తి సంస్థానంలోని ఇప్పుడు ఏదులగా పిలువబడుతున్న నాటి గోపాలుపేట సంస్థానం. మియాసావు తల్లి హసన్‌బీ, తండ్రి బందిగసావు. మియాసావు పుట్టిన మూన్నాళ్లకే సద్దిమూట చేతబట్టి ఇల్లు వదిలి పోయాడట ! మియాసావు స్థానిక లంబాడోళ్లు, పేదల కష్టాలు చూసి చలించిపోయాడు. వాళ్లకు ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో అనేక రకాలుగా ఆలోచించాడు. పేదలకు పెద్ద ఎత్తున సాయం చేయాలంటే ధనం ఆ స్థాయిలోనే కావాలని గ్రహించాడు. దీంతో దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించాడు. ఇక అప్పటి నుంచి చెలరేగిపోయాడు. ఫలానా వ్యక్తి ధనికుడని తెలిస్తే చాలు.. అతని ఇల్లు గుల్ల చేసి, ఆ దోచిన ధనాన్ని పేదవాళ్లకు పంచి పెట్టేవాడు. పానుగల్లు గుట్ట మీద తన స్థావరాన్ని ఏర్పర్చుకున్నాడు. 12 మంది నిష్ణాతులైన లంబాడోళ్లను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఆ కాలంలో వనపర్తి సంస్థానధీశుడు ప్రథరరామేశ్వరరావుతో మియాసావుకు మంచి స్నేహం ఉండేదని చెబుతారు. ఈ సంస్థానాధీశుడి భార్యకు సత్కార్యాలు చేసే గుణం ఎక్కువ. కాబట్టి, మియాసావు ధనికులను దోచి పేదలకు పంచుతాడని తెలిసి ఆమె కూడా అతనికి సహకరించేదట ! మియాసావు దొంగతనాలు చేసి సంపాదించిన సొమ్ముతో కానాయిపల్లి గుట్టల మధ్య ఇప్పటి శంకర సముద్రం చెరువు, గద్వాల పట్టణంలోని శ్రీరంగాపురం ఆలయ గోపురాన్ని, పెబ్బేరు బురుజు ముఖ్యమైనవి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాడు కూడా నేటి లాగే కరువు కరాళ నృత్యం చేసేది. దీంతో దోచిన ధనంలో సగానికి పైగా పేదలకు అన్నం పెట్టడానికే ఖర్చు చేసేవాడని చెబుతారు. మియాసావు దొంగతనాల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఇతను దోచుకోవాలని నిర్ణయించిన ధనికుడికి ముందుగానే ఉత్తరం ద్వారా తెలిపేవాడు. ఎవరు ధనికులో, ఎవరు పేదలో ఇట్టే పసిగట్టేవాడట ! దీనివల్లనే నాటి ప్రజలు మియాసావుకు మానవాతీత శక్తులున్నాయని నమ్మేవారు. దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఓ సారి కానాయిపల్లిలో చిట్టెప్పార అనే వ్యక్తిని దోచుకు రావాలని మియాసావు తన అనుచరులను పురమాయిస్తాడు. వాళ్లు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి ధనం ఇవ్వాలని అడుగుతారు. కానీ, చిట్టెప్పార తన వద్ద అంత ధనం లేదని, తాను వంటవాడినని, నా దగ్గర ధనమెక్కడి నుంచి వస్తుందని తెలుపుతాడు. అంతే కాకుండా, మియాసావు మనుషులు పేదవాళ్లను ఏమీ అనరని తెలిసిన చిట్టెప్పార, మియాసావు అనుచరుల్లో నాయకుడైన ధనిగార అనే వ్యక్తిని కొట్టినంత పని చేస్తాడు. తమ నియమాలకు బద్ధులై వారు చిట్టెప్పారను ఏమీ అనకుండా వెనుదిరుగుతారు. తమ నాయకుడు మియాసావుకు జరిగినదంతా వివరిస్తారు. వాళ్లు చెప్పిందంతా విని చిట్టెప్పార మోసం చేస్తున్నాడని గ్రహిస్తాడు. భోగమేళం కళాకారిణిగా వేషం మార్చుకుని, కానాయిపల్లికి చేరుకుంటాడు. ఊళ్లోకి భోగమేళం వచ్చిందని తెలిసి ఊళ్లోని ఆడవాళ్లంతా చూడడానికి సిద్ధమవుతారు. ఈ కాలంలో సినిమాకు వెళ్లాలంటే ఎలాగైతే మంచి బట్టలు కట్టుకుని, ముస్తాబై వెళ్తారో, నాడు భోగమేళానికి అలాగే వెళ్లేవారు. ఇక్కడే మియాసావు ఎత్తుగడుంది. ఊళ్లోని ధనికుల భార్యలందరూ భారీ చీరలు కట్టుకువస్తారని అతని తెలుసు. మరి చిట్టెప్పార భార్య ఎలాంటి చీర కడుతుందో చూసి, అతడు ధనికుడా, పేదవాడా అని మియాసావు తెలుసుకుంటాడన్నమాట ! మియాసావు అంచనా నిజమవుతుంది. చిట్టెప్పార ధనికుడని తెలుసుకుంటాడు. అతని ఇంటికి తన అనుచరులతో కలిసి నాలుగు దెబ్బలు తగిలించేసరికి, చిటెప్పార తన ఆస్తుల చిట్టా విప్పుతాడు. అప్పుడు అతని దగ్గరున్న ధనాన్ని దోచి పేదలకు పంచుతాడు. ఇదిలా ఉంటే, మియాసావుకు మంత్రాలు తెలుసని నాటి జనం నమ్మేవారు, ఈ సంఘటనలో భోగమేళం సమయంలో మియాసావు మంత్రం చదివి ధనికుల భార్యల ఒంటి మీది బట్టలను కూడా ఊడదీసి దోచుకున్నాడని చెబుతారు. ఈ సంఘటనలో అతనికి మానవాతీత శక్తులున్నాయో లేవో అనవసరం. కానీ, మియాసావు ఓ గొప్ప మానవతావాది. ఎలాంటి యిజాలు, ప్రజాస్వామ్యాలు లేని నాటి కాలంలో పేదలకు సాయం చేయాలన్న అతని సంకల్పం గొప్పది. చరిత్రలో చెరువులు, బురుజులు, గోపురాలు కట్టిన దొంగ బహుషా మియాసావు ఒక్కడే కావచ్చు. అందుకే, మియాసావును రాబిన్‌ హుడ్‌తో పోల్చడం జరిగింది. కనుమరుగైన ఓ చరిత్ర పురుషుడిని ‘జనంసాక్షి’ తన పాఠకుల ముందు నిలబెట్టింది.