బండి సంజయ్.. నిరూపించు ` కేటీఆర్ ప్రతిసవాల్
హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగంపై ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని, కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడం విచారకరమని అన్నారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘ఇంటెలిజెన్స్ విభాగం ఎలా పని చేస్తుందో సంజయ్ అర్థం చేసుకోలేరు. నిర్లక్ష్యంతో ఆయన చేసిన ప్రకటనలు హద్దు మీరాయి. చౌకబారు ఆరోపణలతో ఆయన మరింత దిగజారారు. రాజకీయ ఉనికి కోసం రోడ్లపై చౌకబారు నాటకాన్ని ఎంచుకున్నారు.’’ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో నిజం ఉంటే నిరూపించాలని సంజయ్‌కు సవాల్ విసిరారు. లేదంటే 48 గంటల్లో వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు.