మురికివాడల్లో పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు
` కట్టించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం : మంత్రి పొంగులేటి
` అర్హులైన ప్రతీ నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తున్నాం
` ` గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదు
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
` కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం
` గత ప్రభుత్వ ప్రతీ పథకం వెనకా అదే బాగోతం
` ఏ పనిచేసినా దోచుకేవడమే లక్ష్యం
` ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవంలో మంత్రి విమర్శలు
వరంగల్ ప్రతినిధి, ఆగస్టు 8 (జనంసాక్షి):రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబం సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని బాలసముద్రం అంబేద్కర్ నగర్ లో జి ప్లస్ త్రీ విధానంలో నిర్మించిన 592 రెండు పడక గదుల ఇండ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద లతో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి మొదటి బ్లాకును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తదితరులను పలువురు లబ్ధిదారులు నూతన వస్త్రాలను బహూకరించారు. నిరుపేదలమైన తమకు రెండు పడక గదుల ఇండ్లను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు, 2బిహెచ్ కె ఇండ్ల పంపిణీ కార్యక్రమం హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలోని ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా, మంత్రి శ్రీనివాస్ రెడ్డి కంప్యూటర్ బటన్ ఆన్ చేసి ర్యాండమైజ్ లో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇది పేదల ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సినంత ఖర్చు చేసి పేదల కల, ఆశను నెరవేర్చలేదన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన వద్దకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలుమార్లు కలిసి ఇండ్ల పంపిణీ గురించి ప్రస్తావించారని అన్నారు. రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు జరిగిందన్నారు. పేదవారి కలను ప్రజా ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. కట్టిన ఆరు సంవత్సరాలైన గత పాలకులు ఇండ్లు ఇవ్వలేదన్నారు. ప్రైమ్ ల్యాండ్ అని, జీవనోపాదికి అన్ని ఆ ప్రాంతంలో ఉన్నాయన్నారు. ఇంకా అర్హులైన పేదవారికి స్లమ్ ఏరియాలో ఉంటున్న వారికి కూడా కేటాయిస్తామని, అలాంటి వారి జాబితాను కలెక్టర్ రూపొందిస్తే అదనంగా ఇండ్లను కేటాయిస్తామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నాలుగు విడతల్లో అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని పునరుద్ఘాటించారు.రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. హన్మకొండ లో ఈ రోజు ప్రారంభించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఈ పథకంలో భాగమేనని, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటివని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.దాదాపుగా అరవై లక్షల వ్యయమైన ఇండ్లను నిరుపేదలకు కేటాయించడం జరిగిందన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. గుడిసెలు వేసుకున్న అందరికి ఇండ్లను కేటాయించామని, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా న్యూశాయంపేటలో కేటాయిస్తామన్నారు. ఇంకా చాలామంది నిరుపేదలున్నారని, శాయంపేట, తదితర ప్రాంతంలో ప్రభుత్వ భూములు గుర్తించి అక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేవిధంగా కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ని కోరారు. ఇండ్లలో తాగునీరు, విద్యుత్, తదితర సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ నగరాభివృద్ధికి ఇది ఒక మైలురాయని అన్నారు. నిరుపేదల కు సొంతిల్లు ఒక కల, ఆ కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని 18 నెలల్లో చేసి చూపించారని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అభివృద్ధి కి ఎమ్మెల్యేలు గా కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల దిల్లీ కి వెళ్ళినప్పుడు కూడా వరంగల్ ఎయిర్పోర్ట్, తదితర అభివృద్ధి కి కావాల్సిన నిధులు కు కేంద్ర మంత్రులను కలిసినట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తో ఇండ్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా చేపట్టడం జరిగిందన్నారు. పేదలు ఎన్నో ఏండ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న కల నెరవేరిందన్నారు. పేదల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు కావాలనే నిందలు వేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు. ఇండ్లు పొందిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా కేటాయింపు జరిగిందన్నారు. గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇండ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. 592 చదరపు అడుగుల విస్తీర్ణంలో 592 ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. అత్యంత విలువైన స్థలంలో ఇండ్లను నిర్మించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, జిడబ్ల్యుఎంసి కమీషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, ఇతర సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గోన్నారు.