ఎస్‌సీవో సదస్సులో పాల్గొనండి
` మోదీకి చైనా ఆహ్వానం
బీజింగ్(జనంసాక్షి):ఆగస్టు చివరలో తియాంజిన్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన బీజింగ్.. ప్రధాని మోదీ పర్యటనను స్వాగతించింది. ఈ శిఖరాగ్ర సమావేశం సభ్యదేశాల మధ్య సంఫీుభావం, స్నేహం, ఫలవంతమైన ఫలితాలకు వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేసింది.ద్వైపాక్షిక వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఆగస్టు 30న జపాన్‌లో పర్యటించనున్నారు. అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లనున్నారు. ఇదే విషయంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువా జియాకున్ స్పందిస్తూ.. ఎస్‌సీవో సభ్యదేశాలు సహా 20 దేశాల నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఇందుకు హాజరుకానున్నారని చెప్పారు. అయితే, ప్రధాని జపాన్, చైనా పర్యటనలకు సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.ప్రధాని మోదీ చైనాలో చివరిసారిగా 2018లో పర్యటించారు. అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.