ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం

` వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి
` బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం
` నా ఆరోపణలపై ఈసీకి మౌనమెందుకు?
` బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు
బెంగళూరు(జనంసాక్షి):ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్లను దొంగిలించేందుకు ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆయన విమర్శించారు. బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్క్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం మరోసారి ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించారు.ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రజలు చైతన్యంతో ఉండాలని, ఈ ఎన్నికల్లో న్యాయం నిలవాలంటే అధికార యంత్రాంగం కక్ష సాధింపులు చేయకుండా వ్యవహరించాలంటూ రాహుల్‌ గాంధీ హితవు పలికారు. అంతేకాదు, కర్ణాటకతో పాటు- ఇతర రాష్టాల్ల్రో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో విూరు రాజ్యాంగాన్ని తాకాలని అనుకుంటే, ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఈ విషయంలో విూరు ఎంత తెలివిగా దాక్కున్నా, మేము మిమ్మల్ని పట్టుకుంటామన్నారు. ఇందుకు కొంచెం సమయం పట్టొ-చ్చు, కానీ తప్పకుండా పట్టుకుంటామని రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘానికి వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్నికలు దేశ గుండె చప్పుడని, అలాంటి క్రమంలో ఒక్క ఓటు- దొంగిలించబడినా అది జనాభా గొంతును నొక్కేయడమేనని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఇలాంటి ఘటనలు జరిగితే, అది రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా డెమాక్రసీకి సవాల్‌గా మారుతుందన్నారు. నిజంగానే ఎన్నికల సంఘం ఎవరి పక్షం వైపు ఉందని ప్రశ్నలు పలువురిలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్క కర్ణాటక సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమగ్రత గురించి చర్చకు దారితీస్తుంది. కానీ, రాహుల్‌ గాంధీ ఇక్కడితో ఆగలేదు. ఆయన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దాన్ని కాపాడటానికి తాము ఎంతకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాహుల్‌ గాంధీ ఐదు ప్రశ్నలు సంధించారు. డిజిటల్‌ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు?. సీసీ పుటేజీని ఎందుకుఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు? నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది. భాజపా ఏజెంట్‌గా ఈసీ మారిపోయిందా?అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో అమూల్యమైనదని ఈ సందర్భంగా రాహుల్‌ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలో లక్ష కంటే ఎక్కువ దొంగ ఓట్లున్నాయి. ఎన్నికల సంఘం బిజెపితో కుమ్మక్కయ్యిందని రాహుల్‌ ఆరోపించారు. 40 మందితో కూడిన బృందం ఆరు నెలలపాటు- నిర్వహించిన విశ్లేషణలో వేలాది నకిలీ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు చెల్లని ఫొటోలు, అనుమానాస్పద ఫారం 6 దరఖాస్తులు బయట పడ్డాయని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌, సిఎం సిద్దరామయ్య, డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రాహుల్‌ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. తను చేసే వాదనలను ధృవీకరిస్తూ అధికారిక ప్రకటనపై సంతకం చేయాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఎన్నికల సంఘం సవాల్‌ విసిరింది. రాహుల్‌ గాంధీ దగ్గర రెండు ఆప్షన్‌లే ఉన్నాయి. ఒకటి ఆయన చేసే ఆరోపణలు నిజమనుకుంటే.. డిక్లరేషన్‌పై సంతకం చేయడం లేదా.. ఇసిఐపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పడం అని ఎన్నిక సంఘం వర్గాలు తెలిపాయి.

అభ్యంతరాలుంటే త్వరగా చెప్పండి
` ఎందుకు ఆలస్యం చేస్తున్నారు
` రాహుల్‌కు ఈసీ ప్రశ్న
న్యూఢల్లీి(జనంసాక్షి):భాజపా, ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న సంచలన ఆరోపణలపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. బిహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని తాము ఆగస్టు 1న ప్రకటన విడుదల చేసినా.. మార్పులు చేర్పులపై ఇప్పటివరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. అభ్యంతరాలు చెప్పడానికి ఆయన ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై తన అభ్యంతరాలను రాహుల్‌ గాంధీ ఇప్పుడు కాకుండా ఎప్పటిలాగే బిహార్‌ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే ఇస్తారేమోనని ఈసీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఓట్ల చోరీ గురించి రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘాన్ని హెచ్చరించిన అనంతరం ఈసీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల రిగ్గింగ్‌కు సంబంధించి రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్‌ రాహుల్‌ను సవాల్‌ చేయడంపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర, హరియాణా మొదలైన ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్న వెంటనే ఈసీ ఆ విషయంలో దర్యాప్తు చేయడం మానేసి.. రాహుల్‌గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దబాయిస్తోందన్నారు. అసలు దర్యాప్తే చేయనప్పుడు ఆయన వాదనలు తప్పని ఎన్నికల కమిషన్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తాము సమర్పించిన ఆధారాలు ఈసీ ముందే ఉన్నాయని.. వాటిని పరిణగణలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని సూచించారు. తాము ఆందోళన వ్యక్తంచేస్తోంది కేవలం ఒక పార్టీ గురించి మాత్రమే కాదని.. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ గురించని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేటప్పుడు, రాజ్యాంగంపై దాడి చేసేటప్పుడు ఎన్నికల అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిని పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టినా.. ఎప్పటికైనా తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తాను చేస్తున్న ఆరోపణలపై ప్రమాణం చేయాలని ఈసీ చేస్తున్న డిమాండ్‌ను తిప్పికొట్టారు. తాను ఇప్పటికే ఎంపీగా పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేశానన్నారు.