అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు

` ‘రాయిటర్స్‌’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ
న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలు ప్రణాళికను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రక్షణ శాఖ స్పందించింది.ఈ అంశంపై ‘రాయిటర్స్‌’ ప్రచురించిన వార్తా కథనాన్ని తోసిపుచ్చింది. ఆ దేశం నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించినట్లు ‘రాయిటర్స్‌’ వెలువరించిన కథనం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.అమెరికా సుంకాల విధింపుపై నేపథ్యంలో ఆ దేశం నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఓ కథనం వెలువరించింది. ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి త్వరలో అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా తన పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే, అలాంటిదేమీ లేదంటూ తాజాగా రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది.