ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సీబీఐకి ఇవ్వాలి

` ఎన్నికల్లో పట్టుబడ్డ వందలకోట్లు కేసీఆర్‌ ఖాతాలోకి..
` అత్యధికంగా ట్యాప్‌ జరిగింది నా ఫోనే..
` భార్యాభర్తల ఫోన్లుకూడా ట్యాప్‌ చేసిన దుర్మార్గులు
` సిట్‌ విచారణ అనంతరం మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మరోమారు డిమాండ్‌ చేశారు. ఇందులో లోతుగా విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహంలో సిట్‌ విచారణకు హాజరైన అనంతరం విూడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే కేసీఆర్‌ కుటుంబానికి సీఎం క్లీన్‌ చిట్‌ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్‌కు అధికారాలు లేవని, విచారణతో కాలయాపన తప్ప ఇంకేం జరగదని అన్నారు. గతంలో భారత రాష్ట్ర సమితి దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అత్యధికంగా నా ఫోన్‌ కాల్స్‌నే ట్యాప్‌ చేశారు. నా కుటుంబ సభ్యులు, పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు. భార్యాభర్తల ఫోన్లూ ట్యాప్‌ చేసి విన్నారు. నా వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం అధికారులకు ఇచ్చాను. వాస్తవానికి మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్‌ చేయాలి. కానీ, ఆ జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటిసారి వాంగ్మూలం ఇచ్చింది నేనే. కేసీఆర్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్‌ చేసింది. కేసీఆర్‌ కుమార్తె, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు. గత ప్రభుత్వంలో సాధారణ ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేందుకు భయపడి వాట్సప్‌ కాల్స్‌ మాట్లాడేవాళ్లు. అప్పటి భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని బండి అన్నారు. కేసీఆర్‌ కుమార్తె, అల్లుడి ఫోన్లు ట్యాప్‌ చేశారు. వారినీ విచారణకు పిలవాలి. ఎస్‌ఐబీని సొంత అవసరాలకు అడ్డాగా కేటీఆర్‌ మార్చారు.నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు,ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు. టీ-ఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌ ద్వారా అనేక లావాదేవీలకు సంబంధించి లబ్ధి పొందారు. ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు బాగోతం చెబుతుంటే నాకే సిగ్గనిపించింది. వారిద్దర్నీ సమాజం క్షమించదు. ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారు.. క్షణక్షణం బాధపడాలి. మా కార్యకర్తలను, ఇతర పార్టీ నాయకులను క్షోభకు గురి చేశారు. ఇద్దరు నిందితులను కాపాడే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. వ్యాపారుల లావాదేవీలు తెలుసుకొని కేటీఆర్‌ బ్లాక్‌మెయిలింగ్‌ చేశారని బండి అన్నారు.ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా రూ.వేల కోట్లు దోచుకున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఖమ్మం ఎంపీ అభ్యర్థి వద్ద రూ.7 కోట్లు- పట్టుకున్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియదు. చాలామంది నాయకుల వద్ద రూ.వందల కోట్లు- సీజ్‌ చేసి పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు పంపారు. రూ.20 కోట్లు- దొరికితే.. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫోన్‌ చేశాక రూ.2 కోట్లు- అవుతాయి. రూ. వేల కోట్లు- అక్రమాలు జరిగితే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఈడీకి లేఖ రాస్తే విచారణ జరుపుతుంది. సిట్‌ అధికారులు నిజయితీ పరులు, వారిపై మాకు అనుమానం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైనే మా అనుమానం అంతా. ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు- ఆధారాలున్నా ఎంతకాలం గడుపుతారు. కమిషన్లు వేసి కాలయాపన చేస్తారు. నివేదికలు ఇచ్చినా చర్యలు లేవు. ఏడాది గడిచినా ఒక్క నాయకుడిని అరెస్టు చేయలేదని బండి సంజయ్‌ అన్నారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి సిట్‌ అధికారులు అందించిన వివరాలు చూసి తాను షాక్‌ అయినట్లు- మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. తన ఫోన్‌, తన కుటుంబ సభ్యులతోపాటు- తన ఓఎస్డీ, వ్యక్తిగత సిబ్బంది ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు- చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతున్నట్లు- తాను గుర్తించానని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తన ఫోన్లు ఎక్కువ సార్లు ట్యాప్‌ చేశారని పేర్కొన్నారు. మావోయిస్టుల జాబితాలో తమ పేర్లు పెట్టి ట్యాప్‌ చేశారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో తాను మాట్లాడిన అన్ని కాల్స్‌ ట్యాప్‌ చేశారని వివరించారు. టీ-బీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో తన చుట్టూ నిఘా పెట్టారని విమర్శించారు. వావివరసలు లేకుండా ఫోన్లు ట్యాప్‌ చేశారంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ఫోన్ల ట్యాపింగ్‌ వెనుక బీఆర్‌ఎస చీఫ్‌ కేసీఆర్‌ పాత్ర ఉందని కుండ బద్దలు కొట్టారు. కేసీఆర్‌ పాలనలో సామాన్యులు సైతం ఫోన్లు మాట్లాడ లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో భార్యాభర్తల ఫోన్‌ సంభాషణలూ కూడా విన్నారంటూ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్‌ రావు, రాధాకిషన్‌ రావులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులను రేవంత్‌ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేశారన్నారు. ఎన్నికల సమయంలో దొరికిన నగదంతా కేసీఆర్‌ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఈ కేసును ఇంకా ఎంత కాలం సాగదీస్తారు? అంటూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అంటూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బండి సంజయ్‌ నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని సిట్‌ కార్యాలయంలో అధికారుల విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు- బండి సంజయ్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షిగా బండి సంజయ్‌ అందించిన వాంగ్మూలాన్ని వారు రికార్డు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను సిట్‌ అధికారులకు బండి సంజయ్‌ అందజేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ అయినప్పటి నుంచి విూ ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు- బండి సంజయ్‌కు సిట్‌ అధికారులు వివరించారు. అలాగే ఎవరితో ఎంత సేపు మాట్లాడారన్న డేటాను సైతం ఆయనకు వారు సాక్ష్యాలతో సహా చూపించారు. మునుగోడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో బండి సంజయ్‌ మాట్లాడిన డేటాకు సంబంధించిన వివరాలను ఆయనకు సిట్‌ అధికారులు ఈ సందర్భంగా అందజేశారు.