తెలంగాణ వచ్చిన తరవాతనే అభివృద్ది
గతంలో ప్రజాధనం వృధా చేశారు: ఈటెల
కరీంనగర్,జూలై27(జనం సాక్షి): గత ప్రభుత్వాలు నాలుగు లక్షల రూపాయలు కూడా ఇవ్వని గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తరవాతనే గ్రామాలలో అభివృద్ధి ఎలా జరుగుతోందో ప్రజలకు తెలుసన్నారు.కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మాజీపల్లె గ్రామంలో రూ.16 లక్షల ఖర్చుతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. గ్రామంలో 10 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత మల్యాల గ్రామంలో రూ.9 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన స్మశాన వాటికను, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్టు ఉండేదని, అలా చేయకుండా మిమ్మల్ని పట్టించుకున్నవారికి, అభివృద్ధి చేసిన వారికి పట్టం కట్టండి అని మంత్రి రాజేందర్ ప్రజలకు సూచించారు. రైతులు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించుకున్నామని చెప్పారు.