తెలంగాణ విముక్తి తరహాలో దేశ విముక్తి
బిజెపి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిందే
కెసిఆర్ ఎత్తిన పిడికిలితోనే ఇది సాధ్యం
దేశ రక్షణకు కెసిఆర్ ముందుండి నడుస్తారు
టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడి
నిజామాబాద్,ఫిబ్రవరి26(జనం సాక్షి): తెలంగాణకు విముక్తి దక్కినట్లే బిజెపి నుంచి భారతదేశానికి ముక్తి కలగాల్సి ఉందని టిఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. ఇది సిఎం కెసిఆర్‌తో మాత్రమే సాధ్యమని అన్నారు. ఇప్పుడు కెసిఆర్ యుద్దం మొదలు పెట్టారని, ఆయన ఏ పని మొదుల పెట్టినా విజయం సాధించే వరకు వదలరని అన్నారు. తెలంగాణ పురోగించినట్లే దేశం కూడా ముందుకు సాగాల్సి
ఉందన్నారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేవిూ లేదని ఆమె అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా సీఎం కేసీఆర్‌పైనా బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలను రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలే తిప్పికొట్టాలని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ, రాష్టాన్రికి నిధులు ఇవ్వకుండా వివక్షత చూపుతున్నారని అన్నారు. మనకు నిధులు ఇవ్వకపోగా దేశంలోని అనేక ప్రబుత్వరంగ సంస్థల ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నా రని అన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు అంటూ మభ్యపెట్టి ఇప్పుడు మొహం చాటేస్తున్నారని అన్నారు. ఈ విషయాలపై బీజేపీ నేతలను గ్రామాల్లో నిలదీయాల్సిన బాధ్యత తమ కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిచిందని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఆయువు పట్టు అయిన మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణమైతే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సీఏం కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరువస్తుందనే దురుద్దేశ్యంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారని మండిపడ్డారు. భూ నిర్వాసితులతో 361 కేసులు వేయించారన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ వెనకడుగు వేయకుండా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే వరకు నిద్రపోలేదని అన్నారు.ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తికావడంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఇదే మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలను మళ్లించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిజామాబాద్ కూడా లబ్ది పొందుతుం దన్నారు. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండేవిధంగా చూశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా జరగడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బుర పడుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పనులు చేస్తున్నప్పటికీ తెలంగాణలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పుట్టుకనే అవమానించాడని మండిపడ్డారు. తెలంగాణను అవమానించిన, నిధులు ఇవ్వకపోవడాన్ని రాష్ట్రంలోని బీజేపీ నేతలు అధిష్ఠానాన్ని ఎందుకు నిలదీయడం లేదని కవిత ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లా వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిందని అన్నారు. రూ.300 కోట్లతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ కాలువలను ఆధునికీకరించామని అన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా రూ.1500 కోట్లతో నాలుగు నియోజకవర్గాలకు 1 లక్ష 82 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. మంజీరాపై రూ.476 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశామన్నారు. ఇలా జిల్లాను వ్యవసాయ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సింహం లాంటిదని ప్రజల గుండెల్లో ఎప్పుడు రారాజుగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలే తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, రైతు బీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తూ రైతన్నలకు అన్నం పెడుతుండగా కేంద్రంలో ఉన్న
బీజేపీ, మోదీ ప్రభుత్వం రైతాంగానికి సున్నం పెడుతుందని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల బోరు మోటార్లకు విూటర్లను బిగించి చార్జీల పేరిట దోపిడీ చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏడున్నర సంవత్సరాలుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా బోర్డు రాకుండా అడ్డుకున్నారంటూ విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఒకరు, నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా ప్రజల పక్షాన పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఏ ఒక్కరికీ లేకపోయిందన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కాకుండా దేశ ప్రజల సమస్యలపైన టీఆర్‌ఎస్ కేంద్రంనైన, ప్రధాని నరేంద్రమోదీనైనా నిలదీసేందుకు వెనకాడబోమని కవిత అన్నారు. యుద్దం మొదలయ్యిందని, అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయని అన్నారు.