*తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ*

మద్దూర్ (జనంసాక్షి):  తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని శనివారం రోజు  నారాయణపేట  జిల్లా కేంద్రంలోని  సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిపారు.      ఈ  సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్ రామ్  మాట్లాడుతూ  1946 నుండి 1951 మధ్య లో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిందని అన్నారు. భూస్వామ్య,  దోపిడీదారులకు, దౌర్జన్య దారులకు వ్యతిరేకంగా తాడిత పీడిత ప్రజలందరూ కమ్యూనిస్టుల నాయకత్వంలో  మహత్తర పోరాటాలు నిర్వహించారని అన్నారు.     ప్రజల తరఫున కమ్యూనిస్టు నాయకులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, పుచ్చలపల్లి, సుందరయ్య, మగ్దూం మొహినొద్దీన్, చాకలి ఐలమ్మ,మల్లు స్వరాజ్యం, వంటినేతలెందరో పోరాడారు.  దొడ్డి కొమురయ్య, షేక్ బందగి వంటి వారితోపాటు వేలాది ప్రజలు తమ ధన మాన ప్రాణాలు కోల్పోయారు. గడీల పాలన పై బడుగు బలహీన వర్గాలు దండెత్తారు. విసునూరు రామచంద్రారెడ్డి వంటి  దేశ్ ముఖ్ లు  పల్లెల వదిలి పట్టణాలకు పారిపోయారని తెలిపారు. ఇట్లాంటి వీరోచితమైన పోరాటాన్ని కొంతమంది ఇది హిందూ ముస్లిం కొట్లాట గా చిత్రీకరించడం దారుణమని విమర్శించారు.  అట్లాంటి వారిని చరిత్ర తెలియని అవివేకులాగా చూడాలన్నారు. నిజాం భారత సైనికులకు లొంగిపోవడం అంటే అది తెలంగాణలో కమ్యూనిస్టులు  జరిపిన  వీరోచిత పోరాటమే  అని తెలిపారు. పటేల్ భారత సైన్యమును పంపడంలో ఆలస్యం చేస్తే ప్రజలు నిరంకుశ నిజాం నవాబును హైదరాబాద్ నడిబొడ్డున ఉరికంబం ఎక్కించేవారు. కానీ పటేల్ వచ్చి నిజాం ను గవర్నర్( రాజ్ ప్రముఖ్ పీఠం ) పీఠం ఎక్కించారు అని అన్నారు. ఆ పోరాటంలో కమ్యూనిస్టులు దున్నేవానిదే భూమి అంటూ భూస్వాములను తరిమేసి  10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారు.  నాలుగువేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసుకొని రజాకార్లకు వ్యతిరేకంగా  వ్యతిరేకంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రంలో  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం బాలప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మోహన్, కార్యదర్శి నరహరి. నాయకులు కాశి, మహేందర్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.