తెలివైన పరిష్కారం
భారత్-చైనా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవాధీన రేఖ ఎ్కడుందో తెలియదంటూ భారత భూభాగంలోకి 19 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా సైన్యం కొద్దిరోజుల పాటు ఇక్కడే తిష్టవేసింది. డేరాలు వేసుకొని, ఆ ప్రాంతంలో చైనా జాతీయ జెండాను ఎగురవేసిన చైనా బలగాలు కవ్వింపు చర్యలకూ పాల్పడ్డాయి. ఈనేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల పాలకులు సంయమనంతో వ్యవహరించగా, ప్రతిపక్షాలు మాత్రం కయ్యానికి కాలు దువ్వాలన్నట్లుగానే వ్యవహరించాయి. సమస్యను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశమున్నా అందుకు తగిన సూచనలు ఇరు దేశాల ప్రతిపక్షాలు ఇవ్వలేకపోయాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు చైనాలో పర్యటించి చర్చలు జరుపుతానన్న భారత విదేశాంగశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటనను మన ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నప్పుడు భారత్ శాంతిమంత్రం జపించడం, విదేశాంగ మంత్రి ఆ దేశంలో పర్యటించడం సరికాదనే సూచనలు ఇచ్చాయి. మీడియా సైతం ఈ విషయాన్ని రచ్చ చేయాలని చూసింది. ఇదిగో యుద్ధం వచ్చేసింది.. అవిగో చొరబాట్లంటూ కథనాలు వండి వడ్డించాయి. యుద్ధోన్మాథం కమ్ముకున్న మీడియా చర్యలను పలువురు ఖండించినా వైఖరిలో మార్పు రాలేదు. రేటింగ్ గోలలో పడికొట్టుకుపోయే ఎలక్ట్రానిక్ మీడియా సంగతి వేరే చెప్పనక్కర్లేదు. భారత్-చైనా మధ్య జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వివాదం దశాబ్దాల తరబడి నలుగుతూనే ఉంది. దీనికి ఏదో ఒక పరిష్కారం కనుగొనకుంటే సమస్య ఇంకా నలుగుతూనే ఉంటుంది. యుద్ధం వస్తే దాని తాలుఖు ప్రభావ పరిణామాలు ఒకటి, రెండు దేశాలకు మాత్రమే పరిమితం కావు. రెండు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య యుద్ధోన్మాథం తలెత్తితే పెద్దన్న పాత్ర పోషించే అగ్రరాజ్యానికి అంతకుమించి కావాల్సింది ఏముంటుంది. ఏదో ఒక ముసుగేసుకొని, ఏదో ఒక వంకతో ఒక దేశానికి మద్దతిస్తున్నట్లు ఫోజిచ్చి ఉపఖండంలో తన ప్రభావాన్ని పెంచుకునే యత్నం చేస్తుంది. దీనిని ముందే గుర్తించిన భారత్-చైనా స్వీయ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. స్వదేశంలోని ప్రతిపక్షాలు, మీడియా ఎంతగా రెచ్చగొట్టాలని చూసినా సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం దిశగానే ప్రయత్నాలు సాగించాయి. ఇరు దేశాల చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకుంటామని ప్రకటించాయి. లడఖ్ నుంచి ఇంకా ముందుకు సాగొద్దని సైన్యానికి చైనా ఆదేశాలు జారీ చేసి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చైనా వస్తువులకు అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌తో తలపడితే ఇరుదేశాల ఆర్థిక పరిస్థితి అస్థిరమవుతుందనే అంచనాకు వచ్చిన చైనా త్వరగా మేల్కొని సైన్యాన్ని వెనక్కు పిలిపిస్తామని చెప్పింది. ఈక్రమంలో ఇరు దేశాల ప్రతిపక్షాలు పోషించిన పాత్రే ఆక్షేపణీయం. దేశ ప్రజల రక్షణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఒక్క పాలకులదే కాదు, ప్రతిపక్షాలది కూడా. దేశం సమాగ్రాభివృద్ధి, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పాలక, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక భూమిక పోషించాలి. ప్రజాస్వామ్యయుతంగా అధికారపగ్గాలు చేపట్టిన పార్టీ తన విధి నిర్వహణ నుంచి కాస్త పక్కకు జరిగినా ప్రజాపక్షం వహించి అధికారపక్షానికి మార్గనిర్దేశనం చేయాలి. కానీ భారత్-చైనాలోని ప్రతిపక్షాలు యుద్ధం జరిపి తీరాలి అన్నట్టుగా వ్యవహరించాయి. సుహృద్భావపూరక వాతావరణంలో శాంతి సామరస్యం కోసం ప్రయత్నించాల్సిన సమయంలో యుద్ధం రావాలని ఎవరు కోరుకున్నా తప్పే. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధికోసం చేసే ప్రయత్నాలకు ఇకనైనా ముగింపు పలకాలి. భారత్ కూడా లడఖ్ వాస్తవాధీన రేఖ ప్రాంతాన్ని ‘నో మన్ ల్యాండ్’ అని వదిలేయంగా నిర్దిష్టమైన హద్దును ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు భారత్-చైనా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సంప్రదింపులు జరిపి నిర్దిష్టమైన వాస్తవాధీన రేఖను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో బలమైన కంచె ఏర్పాటు చేసుకోవడం ద్వారా కవ్వింపు చర్యలకు తావివ్వకుండా జాగ్రత్త పడాలి. యుద్ధం తెచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో ముందస్తుగానే గుర్తించి నివారణ చర్యలు జరిపిన భారత్-చైనా ప్రభుత్వాల చర్యలు అభినందనీయం. ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మాక సలహాలు, సూచనలు ఇస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.