తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్‌ కీలక నిందితుడు


` ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టాం
` హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడి
హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి):తెలుగు అకాడవిూలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాడవిూ అకౌంట్స్‌ అధికారి రమేశ్‌కు అక్రమాలకు పాల్పడిన ముఠాతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో కొందరిని అరెస్టు చేశామన్నారు. మరో 9 మందిని అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు. ‘‘మొత్తం రూ.64.5 కోట్ల నిధులు గోల్‌మాల్‌ చేశారు. కార్వాన్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ నుంచి 26కోట్లు, రూ.11 కోట్లు సంతోష్‌ నగర్‌, చందనగర్‌ కెనరా బ్యాంక్‌లోని రూ. 6 కోట్లు కొల్లగొట్టారు. ఈ కుంభకోణంలో సాయికుమార్‌ కీలక నిందితుడు. ఇతనిపై గతంలో 3 కేసులున్నాయి’’ అని అంజనీకుమార్‌ తెలిపారు. కాగా, ఇవాళ సీసీఎస్‌ పోలీసులు బ్యాంకు ఏజెంట్లు సాయికుమార్‌, రాజ్‌కుమార్‌, వెంకట్‌తో పాటు చందానగర్‌ కెనరా బ్యాంకు మేనేజర్‌ సాధనను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముఠా మళ్లించినట్లు తేల్చారు.
ఒప్పందం ప్రకారం పంచుకున్నారు..
‘‘డబ్బులన్నీ ఆగ్రసేన్‌ బ్యాంకు కోఆపరేటివ్‌ సొసైటీ ఖాతాలోకి వెళ్లాయి. అకాడవిూ సభ్యుల లాగా ఆగ్రసేన్‌ బ్యాంక్‌లో ఖాతాలు తెలిచారు. సాయి కుమార్‌కి ఈ డబ్బులో అధిక శాతం వెళ్లాయి. మిగిలిన వారు ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. కొంత నగదును ఖాతాల్లో నిలుపుదల చేశాం. పంచుకున్న డబ్బులతో నిందితులు ఆస్తులు కొన్నారు. కొంతమంది అప్పులు ఇచ్చారు. మార్కంటైల్‌ బ్యాంక్‌కు 10శాతం కమిషన్‌ వెళ్లింది’’ అని సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.