దక్షిణాఫ్రికా ప్రయాణికులపై అప్రమత్తత
` 14 రోజుల క్వారంటైన్ ఉంచాలని తెలంగాణ సర్కారు నిర్ణయం
` కొత్త వేరియంట్ పై హరీష్‌రావు ఉన్నత స్థాయి సమావేశం..
హైదరాబాద్,నవంబరు 28(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్ పై జూబ్లీహిల్స్ లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ లో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి హాస్పిటల్స్‌లో మౌళిక సదుపాయాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక ఫోకస్, ట్రెసింగ్, టెస్టింగ్ తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే కరోనా కొత్త వేరియెంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.
ఒవిూక్రాన్ వేరియంట్‌పై పూర్తిస్థాయి రివ్యూచేశాం..
ఒవిూక్రాన్ వేరియంట్‌పై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో సవిూక్ష సమావేశం జరిగిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. యూరోపియన్, హాంకాంగ్ సౌత్ ఆఫ్రికా నుండి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా .. విదేశీయులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారా.. లేదా .. క్వారంటైన్‌లో పెట్టి టెస్టులు చేస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు కొత్త వేరియంట్ నమోదు కాలేదని, కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలు వ్యాక్సిన్ పూర్తిగా వేసుకోవాలి.. రెండో డోస్ ఎవరు తీసుకోలేదో వారు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఒమి క్రాన్ వేరియంట్ ప్రభావం దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరో రెండు వారాలు పడుతుందన్నారు. ప్రజలు.. విధిగా భౌతిక దూరం పాటించాలి,మాస్కులు ధరించాలని తెలిపారు.వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రాణాలు కోల్పోయే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు తీసుకున్నామని హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం.. 60 వేల వరకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అదే విధంగా.. 10 వేల పడకలు పిల్లల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు.రెండు డోసులు వేసుకున్న 6 నెలల తరువాత బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడో డోస్పై విధి విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. ఆ విధివిధానాలు వచ్చాక మూడో డోస్ గురించి చెప్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.