కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కంటి సన్నిధిలో దీపాలు వెలిగిస్తున్నారు. భద్రాచలంలో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. కార్తిక దీపాలు వదులుతున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి కల్యాణ మండపంలో కార్తిక పురాణ ప్రవచనం గావిస్తున్నారు. రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సాయంత్రం సామూహిక కార్తిక దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇక హైదరాబాద్‌లోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే స్వామివారిని దర్శించుకున్న భక్తులు, కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. కాగా, కార్తికమాసం సందర్భంగా భక్తుల కోసం పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. వివిధ డిపోల నుంచి అన్నవరం, కాళేశ్వరం, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడతోపాటు ప్రసిద్ధ శివాలయాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేసింది.