దారి తప్పుతున్న మీడియా


ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుకొమ్ములు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేవి పత్రికలు. న్యాయవ్యవస్థ తర్వాత పత్రికలపై ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉండేది. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో పత్రికలు సాగించిన పోరాటం చిరస్మరణీయం. సురవరం ప్రతాపరెడ్డి, మోటూరు హన్మంతరావు తదితర సంపాదకులు, షోయబుల్లాఖాన్‌, కృష్ణ పత్రిక, నీలగిరి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర తదితర పత్రికలు ప్రజాస్వామిక విలువలకు నిలువెత్తు చిరునామాగా ఉండేవి. భారత స్వాతంత్రోద్యమానికి ప్రజలను కార్మోణ్ముఖులను చేసే దిశగా పత్రికలు గణనీయమైన పాత్ర పోషించేవి. ఆయా పత్రికల్లో ప్రచురితమయ్యే కథనాలు ప్రజలను విశ్వసించేవారు. ఆయా కథనాలు ప్రజా ఉద్యమాల నిర్మాణంలో క్రియాశీలక భూమిక పోషించేవి. మద్దుకూరి చంద్రశేఖర్‌రావు, మగ్ధుం మొయినొద్దీన్‌, చండ్ర నాగేశ్వర్‌రావు, బలగంగాధర్‌ తిలక్‌ తదితర పత్రికల విలువలను ఉన్నత స్థాయిలో నిలిపారు. ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలు వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు ప్రేరణ కలిగించాయి. ఒకప్పుడు ఎంతో ఉన్నతస్థాయిలో ఉండే పత్రికా విలువలు ఇటీవల కాలంలో పతనమవుతున్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్‌ మీడియా చానెళ్లు 865, 1500లకుపైగా పత్రికలున్నాయి. పత్రికలు, చానెళ్లు ఏ స్థాయిలో పెరిగాయో వాటిమధ్య పోటీ కూడా అదేస్థాయిలో పెరిగింది. కొన్నేళ్లలో పత్రికలు, మీడియా చానెళ్లలో విపరీత ధోరణులు పొడసూపాయి. ఏ పత్రికలో ప్రచురితమయ్యే వార్తా, కథనం నిజం, ఏ చానెల్‌ ప్రసారం చేసే కథనాల ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేక ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. పత్రికలు, టీవీ చానెళ్ల నిర్వహణలో వ్యాపారాత్మక ధోరణలతో పాటు రాజకీయ ప్రాధాన్యాలు పెరిగిపోయాయి. ఈ విపరీత ధోరణికి భీజం పడింది పొరుగు రాష్ట్రం తమిళనాడులోనే అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అంతన్నా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీకో పత్రిక, చానెల్‌ ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని చానెళ్లు, పత్రికలు కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయనేది ప్రతి ఒక్కరికి తెలిసినదే. పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, రియల్‌ మాఫియా, మరికొన్ని అసాంఘిక శక్తుల చేతుల్లో పత్రికలు, టీవీ చానెళ్లు ఉన్నాయి. ఆయా శక్తుల ప్రయోజనాలే పరమావధిగా అవి పనిచేస్తున్నాయి. కొన్ని పత్రికలు, చానెళ్ల ఆవిర్భావంలోనే అవినీతి, కుంభకోణాలు దాగి ఉంటున్నాయి. హవాలా రూపంలో వచ్చిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి మీడియా సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. ఆయా మీడియా సంస్థల పరమావధి కూడా ఆ నేరమయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే అవుతుంది. ప్రజా సమస్యలు కాకుండా నేరపూరిత వార్తలు, బ్రేకింగులు వేసి రేటింగ్‌ పెంచుకోవాలన్నదే వాటి లక్ష్యమవుతోంది. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అది సినీ నటుడు చిరంజీవి పార్టీ కావడంతో ప్రజలు ఎగబడి ఆయన సభలకు వచ్చారు. చిరంజీవిని ప్రమోట్‌ చేయడమే పనిగా పెట్టుకొన్న కొన్ని పత్రికలు, చానెళ్లు ఆయనే కాబోయే ముఖ్యమంత్రంటూ ప్రచారంతో ఊదరగొట్టాయి. కానీ చివరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు. పరిశీలనాత్మక ధోరణి, వార్తను ఒకటికి రెండు పర్యాయాలు నిర్ధారించుకొని ప్రసారం చేయడం, ప్రచురించాలని కోరుకోవడం ఇప్పుడు అత్యాశే అవుతోంది. వార్తల ప్రసారంలో బ్రేకింగుల కోసం తొందరపాటు తనంతో వ్యవహరించడం వల్ల కొంత మందికి అన్యాయం జరుగుతోంది. న్యూస్‌ చానెళ్లే దర్యాప్తు సంస్థల అవతారమెత్తి కథనాలు ప్రసారం చేసేస్తున్నాయి. దోషులెవరో, నిర్దోషులెవరో కూడా తీర్పులిచ్చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన న్యూస్‌ చానెళ్లు.. నైతికత.. వాస్తవికత అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల సదస్సులో ప్రెస్‌ కౌన్సెల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగం, కులతత్వం, మతతత్వం, మూఢ విశ్వాసాలు, ఆకలిచావులు తదితర సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతలు సమసిపోవాలంటే ప్రజల్లో శాస్త్రీయ పరమైన సృజనాత్మక పెంపొందేలా మీడియా కీలక పాత్ర పోషించాలని అభిలాషించారు. మీడియాలో పొడసూపిన పెడ ధోరణులు సమాజ హితాన్ని దాదాపు పట్టించుకోవడమే మానేశాయి. సామాన్య ప్రజల బాధలకు అద్దం పట్టేది మీడియా మాత్రమే. పత్రికలు చైతన్యకరదీపికలుగా ఉండేవి. కానీ 1991లో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ప్రభావం మీడియాపై తీవ్రంగా పడింది. రంగు రంగుల్లో పత్రికలు పుట్టుకురావడం, కొద్దికాలానికే అవి దివాళా తీయడం పరిపాటిగా మారింది. మీడియాలోకి అంతర్జాతీయ పెట్టుబడులు ప్రవేశించాయి. ఇది దేశీయ మీడియా ఉనికికే పెను ప్రమాదంగా మారనుంది. పెట్టుబడిదారి శక్తుల కంబంధ హస్తాల్లో బందీ అయిన మీడియాకు స్వేచ్ఛ లభించేలా ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మీడియాకు వ్యష్టి, సమూహ ప్రయోజనాలు కాకుండా బహుళ ప్రయోజనాలు ఉండాలి. జాతికోసం, ప్రజల కోసం పనిచేయడమే పత్రికలకు పరమావధి కావాలి.
– దారమపల్లి నర్సింహారెడ్డి,
సెల్‌ : 9059933253