దిండి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తా
తెలంగాణ స్వయంపాలనలో వుంది
ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తిచేస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్
చౌటుప్పల్ : మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్‌ను తరిమికొడతానని, బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సాగు, తాగుజలాలను అందిస్తానని కం కణం కట్టుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు మొక్కవోని దీక్షతో కార్యాచరణ ప్రకటించారు. డిండి ఎత్తిపోతల పథకానికి మర్రిగూడ మండలం శివన్నగూడెం శివారులోని చెర్లగూడెంలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవి ష్కరించారు. రిజర్వాయర్ నిర్మాణం తో నిర్వాసుతులయ్యే రైతులకు 5రెట్లు పెంచి పరిహారం ఇస్తామంటూ భరోసానిచ్చారు. నిర్వాసిత కు టుబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించారు. ఇద్దరు చదువుకున్నోళ్లు ఉంటే రెండు ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారు. రైతులెవరూ ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల్లో పనులను ప్రారంభిస్తామని చెప్పారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం 3గంటలకు బహిరంగ సభ జరగాల్సి ఉంది. అంతకుముందు నుంచే వర్షం ప్రారంభమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, శామియాలు నెలకూలాయి. బారీకేడ్లు నేలకొరిగాయి. సభావేదికపై ఉన్న టెంటు కూడా రెండుసార్లు పడిపోయింది. స్టేజీ మాత్రమే మిగిలింది. ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దాదాపు గంటకుపైగా భారీ వర్షం కురిసింది. జనం వర్షంలో తడిసి ముద్దయ్యారు.
తడవకుండా ఉండేందుకు జనం నానా ఇబ్బందులుపడ్డారు. ఫ్లెక్సీలను, స్వాగతం తెలుపుతూ ఏర్పాటుచేసిన బ్యానర్లను తీసుకొని రక్షణ కవచాలుగా వాడుకున్నారు. మరికొందరు తాటికొమ్మలను, కుర్చీలను తలపై వర్షానికి అడ్డుగా పెట్టుకున్నారు. బహిరంగ సభ ప్రాంగణమంతా చెల్లాచెదురుగా మారింది. వర్షంలో తడిసి ముద్దయిన జనం, ఇక సీఎం ఏం వస్తారులే అనుకుంటూ వెనుదిరాగారు. మరికొంతమంది మాత్రం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అక్కడే ఉన్నారు. శివన్నగూడ నుంచి బహిరంగ సభ ప్రదేశం 3 కి.విూ.ల దూరం ఉంది. సింగిల్‌రోడ్డు కావడం, వర్షం కురవడంతో, 2కి.విూ.ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. డిండి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి మర్రిగూడ మండలంలో తలపెట్టిన సీఎం పర్యటన వర్షం కారణంగా కేవలం 20నిమిషాల్లోనే ముగిసింది. హైదరాబాద్‌లో సీఎం 2.30గంటలకు బయలుదేరి, 3గంటలకు ఫైలాన్ వద్దకు రావాల్సి ఉంది. వర్షం కారణంగా, రోడ్డు మార్గాన 3.30గంటలకు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, గున్‌గల్, లోయపల్లి, క్షుదాభక్షపల్లి గ్రామాల విూదుగా 4.45గంటలకు చెర్లగూడెం వద్ద ఏర్పాటు చేసిన ఫైలాన్ వద్దకు చేరుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఉన్న జనాన్ని ఉద్దేశించి 10నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి 5.05గంటలకు అక్కడినుంచి రోడ్డు మార్గాన్నే హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు.ఇలా1.50గంటలపాటు సాగాల్సిన సీఎం పర్యటన వర్షం కారణంగా 20 నిమిషాల్లోనే ముగిసింది.
కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రనాయక్, గాదరి కిశోర్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, విద్యాసాగర్‌రావు, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, డోకూరి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.