ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం

ఇప్పటికే చాలామంది ఎంపీలతో మాట్లాడాను
ఉపరాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదు
మహా మనుషులు అలంకరించిన గొప్ప పదవి కోసం పోటీపడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు
లక్నో పర్యటనలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎంపీల మద్దతు కోరిన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి
న్యాయమూర్తి కంటే మెరుగైన ఎంపిక ఏముంటుంది? : అఖిలేష్‌ యాదవ్‌
లక్నో, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి) :
ఉప రాష్ట్రపతి పదవికి రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదని, అందుకే తాను రాజకీయ అంశాలపై మాట్లాడదలుచుకోలేదని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. యోగ్యత విలువల ప్రాతిపదికన పార్టీలకు అతీతంగా తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్లమెంట్‌ ఉభయ సభల ఎంపీలను ఆయన కోరారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అఖిలేశ్‌, కాంగ్రెస్‌ నేతలతో కలిసి మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేశారు. ఇండియా కూటమిలో లేని వ్యక్తులూ తనకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరికీ కృతజ్ఞుడిగా ఉంటానని సుదర్శన్‌ రెడ్డి చెప్పారు. ఇటీవలే తాను దిల్లీలో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను, చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసినట్లు వివరించారు. దేశంలోని విపక్ష కూటమి ప్రగాఢ విశ్వాసంతో తనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిందన్నారు.అఖిలేష్‌ యాదవ్‌ సహకారం కూడా ఇందులో మరువలేనిదని గుర్తుచేశారు. గతంలో ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన మహానుభావుల్లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, డాక్టర్‌ జాకిర్‌ హుసేన్‌, డాక్టర్‌ కేఆర్‌ నారాయణన్‌, హమీద్‌ అన్సారీ ఉన్నారని, అలాంటి మహా మనుషులు అలంకరించిన గొప్ప పదవి కోసం పోటీపడే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు విపక్ష పార్టీలకు కృతజ్ఞుడిగా ఉంటానన్నారు.

దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారు : జస్టిస్‌ బీఎస్‌ రెడ్డి
తాను నక్సలిజానికి మద్దతు తెలిపానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ఆరోపణపై చర్చను పెంచాలనే ఆలోచన లేదని సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసేందుకు అధికార పక్షం నేతలు యత్నిస్తున్నారని అన్నారు. అమిత్‌షా కామెంట్‌పై ఏం చెప్పాలో ఇప్పటికే చెప్పానని, తన స్పందన కూడా మీడియాలో పతాక శీర్షికన ప్రచురితమైందని గుర్తుచేశారు. ఇంకేదో చెప్పి చర్చను సాగదీయాలని తాను భావించడం లేదన్నారు.

హిందీలో ప్రసంగించడం నేర్చుకోలేదు..
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ఎంపీల మద్దతును కోరేందుకే లఖ్‌నవూకు వచ్చానన్నారు. తనకు ఉప రాష్ట్రపతి పదవి లభిస్తే రాజ్యాంగ విలువల ప్రకారం బాధ్యతాయుతంగా నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు. డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ల నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. తాను దక్షిణ భారతీయుడిని అయినందున, హిందీలో ఎలా ప్రసంగించాలో ఎన్నడూ సరిగ్గా నేర్చుకోలేదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు వెళ్లినప్పుడల్లా తాను హిందీలో మాట్లాడేందుకు ట్రై చేసే వాడినని ఆయన చెప్పారు.

న్యాయమూర్తి కంటే మెరుగైన ఎంపిక ఏముంటుంది : అఖిలేష్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌

రాజ్యాంగం, చట్టం, ప్రజల హక్కులను సమర్థించడంలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ కెరీర్‌ ఆయనను అత్యున్నత రాజ్యాంగ పదవికి సాధ్యమైనంత ఉత్తమ ఎంపికగా మార్చిందని సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. న్యాయం కోసం ఈ పోరాటానికి నాయకత్వం వహించడానికి న్యాయమూర్తి కంటే మెరుగైన ఎంపిక ఏముంటుందని ప్రశ్నించారు. న్యాయానికి విలువ ఇచ్చేవారు తమ మనసుతో ఆలోచించి సుదర్శన్‌ రెడ్డికి మద్దతు పలుకుతారని నమ్ముతున్నామని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికను ఒక ప్రత్యేక భావజాలంతో ముడిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అలాంటి విధానం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన చెప్పారు. ఇది విజయమో, ఓటమి గురించో కాదు.. విలువలు, రాజ్యాంగ సూత్రాలకు సంబంధించినదన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యంగ విలువలకు ప్రాతినిథ్యం వహించే అభ్యర్థిని నిలబెట్టడంలో ఉమ్మడి ప్రతిపక్షం ఐక్యత చూపించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రమోద్‌ తివారీ సహా కాంగ్రెస్‌ నాయకులకు, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అఖిలేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.