దిల్లీ ఎన్నికల్లో ఆప్ చరిత్రాత్మక విజయం
42 స్థానాల్లో గెలుపు.. 25 చోట్ల ఆధిక్యం
దిల్లీ : దిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చరిత్రాత్మక విజయం దిశగా ఆప్ దూసుకెఏ్పు్తంది. ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్, భాజపాలను ఆ పార్టీ మట్టికరిపించింది. ఆమ్ ఆద్మీ దెబ్బకు భాజపా సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. కాంగ్రెస్ ఇంత వరకూ ఖాతా తెరవలేదు. మొత్తం 70 స్థానాలకు గాను ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆప్ 42 స్థానాల్లో విజయం సాధించి.. మరో 25 చోట్ల ముందంజలో ఉంది. భాజపా మూడు స్థానాల్లో విజయం సాధించింది.
14న దిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెఏ్పు్తంది. కేజ్రీవాల్ ఈ నెల 14న దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
భార్యకు కృతజ్ఞతలు తెలిపిన కేజ్రీవాల్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతను ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సహకారం లేకుంటే తనకింతటి విజయం లభించేది కాదన్నారు. ఆమె తనని అర్థం చేసుకుని తోడ్పాటునందించిందని చెప్పారు. వీరిద్దరూ ఐఆర్‌ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్)కు ఎంపికై ఏక కాలంలో శిక్షణ తీసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వివాహం చేసుకున్నారు. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు.
పార్టీకి క్షమాపణలు చెప్పాలి: కిరణ్‌బేడీ
భాజపా నేతలకు తాను క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేత కిరణ్‌బేడీ అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌బేడీ కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కృష్ణనగర్ నియోజకవర్గ ప్రజలు తనను వ్యతిరేకించినప్పటికీ, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన భాజపాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలను ఆప్ అధినేత కేజ్రీవాల్ నెరవేరుస్తారని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్‌్‌కి అభినందనలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
దిల్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
కేజ్రీవాల్ నాయకత్వానికే దిల్లీ ప్రజలు పట్టం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు సంప్రదాయ రాజకీయాల మార్పునకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ దిల్లీ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంతో గెలిచిన కేజ్రీవాల్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. భాజపా అభ్యర్థి నూపుర్ శర్మపై 31,583 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేజ్రీవాల్‌కు 57,213ఓట్లు రాగా భాజపా అభ్యర్థి నూపుర్‌శర్మకు 25,630 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్‌వాలియా కేవలం 4,781 ఓట్లు మాత్రమే సాధించారు.
అద్భుత విజయం సాధించారు… హద్దులు దాటకండి: కేజ్రీవాల్
దిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించారు. విజయానందం గర్వంగా, అహంకారంగా మారవద్దని, హద్దులు దాటవద్దని ఆయన సూచించారు. సత్యమార్గాన నడిచి అద్భుత విజయం సాధించామని, ఈ విజయానికి విశ్వ శక్తులన్నీ తమ తోడ్పాటునందించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దిల్లీ ప్రజలకు ఆయన మనః పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.