దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం 

– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల34వేల మందికి చెక్కులు
–  రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌
కరీంనగర్‌, మే9(జ‌నం సాక్షి) : దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 50 లక్షల 34 వేల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. పథకం అమలుకోసం బ్జడెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. ఇలాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. లక్షమంది రైతులతో రేపు హుజూరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కర్షకుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు. రైతుబంధు పథకం భావితరాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నని చెప్పారు. ఈ చారిత్రక కార్యక్రమం ఆరంభానికి కరీంనగర్‌ జిల్లా వేదిక కావడం సంతోషంగా ఉన్నదని మంత్రి చెప్పారు. చారిత్రకసభను అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉన్నదన్నారు. గత ప్రభుత్వాలు లక్షల కోట్లు వెచ్చించామని చెప్పినా అన్నదాతల జీవితాల్లో మార్పురాలేదని, అప్పులు కట్టలేక ఆత్మహత్యలే కొనసాగాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం
వచ్చాక రైతన్నలకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరంట్‌ ఇస్తున్నామని, ఏండ్లుగా రైతులకు చిక్కులు తెస్తున్న భూరికార్డులను ప్రక్షాళన చేశామని చెప్పారు. కొత్త రాష్ట్రం ఇంత త్వరగా అభివృద్ధి చెందడమేమిటని ప్రతి ఒక్కరూ చర్చించుకునే స్థాయికి తెలంగాణ చేరుకున్నదని కొనియాడారు.