ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 01 (జనంసాక్షి): ధరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా తహసిల్దార్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ధరణి, సిఏ భూములు, బృహత్ పల్లె పకృతి వనాలకు భూమి కేటాయింపులు, ఆర్ ఓఎస్ఆర్, ఓటరు ఆధార్ నమోదు ప్రక్రియ, జిఓ 76, 59, మీ సేవా కేంద్రాల ద్వారా ధృవీకరణ పత్రాలు జారీ తదితర అంశాలపై రెవిన్యూ, అటవీ, ఇరిగేషన్, ర.భ. శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరణిలో వచ్చిన ధరఖాస్తులను ఎప్పటికపుడు పరిష్కరించాలని, కాలయాపన చేయొద్దని అన్నారు. వారం రోజుల్లో ధరణిలో వచ్చిన మొత్తం దరఖాస్తులు పరిష్కరించి తదుపరి నివేదికలు అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ , రెవిన్యూ శాఖల పరిధిలో ఉన్న భూసమస్యల పరిష్కారానికి సర్వే నెంబర్లు వారిగా వివరాలు సిద్దం చేయాలన్నారు. ఓటరు ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ గురించి ప్రస్తావిస్తూ.. ఓటరు జాబితా ప్రమాణీకరణ ఉద్దేశం కోసం ఎన్నికల సంఘం ఆధార్ యొక్క సమాచార సేకరణ చేపట్టినట్లు తెలిపారు. బోగస్ ఓట్లు తొలగింపు తదితర అంశాలపై పక్కాగా ఓటరు జాబితా ఉండేందుకు ఆధార్ నమోదు ప్రక్రియ జరుగుతున్నట్లు ఆయన వివరించారు. నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని, పోలింగ్ కేంద్రాలు గూగుల్ మ్యాపింగ్ చేయాలన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు ర్యాండం తనిఖీలు నిర్వహించాలని, ఇల్లందు, కొత్తగూడెం మండలాల్లో జిఓ నెం. 76 ప్రకారం ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులను తయారు చేయు ప్రక్రియ చేపట్టాలని ఆయన అన్నారు. అలాగే జిఓ నెం. 59 ప్రకారం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు జిల్లా అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. లోటుపాట్లుకు తావు లేకుండా పక్కాగా విచారణ ప్రక్రియ నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని అన్నారు. ధృవీకరణ పత్రాలుజారీ కొరకు మీ సేవా కేంద్రాలు ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచొద్దని ఎప్పటికప్పుడు జారీ చేయాలన్నారు. 30రోజుల కంటే పెండింగ్ ఉంచడానికి అవకాశం లేదని, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు మీ సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆయన తహసిల్దారులకు సూచించారు. బృహత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటుకు గుర్తించిన స్థలాలను యంపిడిఓలకు అప్పగించి ధృవీకరణ తీసుకోవాలని చెప్పారు. 7 బృహాత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటుకు స్థల సమస్య ఉన్నదని, తక్షణమే గుర్తించి యంపిడిఓలకు అప్పగించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సీఈ వెంకటేశ్వరరెడ్డి, ర.భ. ఈఈ భీమ్లా, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.