ధరలపై 9న ‘తెలుగు మహిళ ‘ ధర్నాలు
విశాఖపట్నం, జూలై 6: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరగడానికి నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళా విభాగమైన తెలుగు మహిళా ప్రతినిధులు ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి తెలిపారు. నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండడంతో సామాన్య ప్రజలు సతమతమవుతుండగా, తమ కుర్చీలను కాపాడుకోవడంలో మంత్రులు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయన్నారు. కొత్త మద్యం విధానంపై ఆమె మాట్లాడుతూ లాబీలుగా ఏర్పడడం, ఒకే దరఖాస్తు దాఖలయ్యేలా చూడడం ద్వారా మద్యం దుకాణాలు తమ చేతిలోనే ఉండేట్టు మద్యం సిండికేట్ సభ్యులు తెలివిగా జాత్రత్త పడ్డారని తెలిపారు. ఈ అక్రమాలనను నియంత్రించడానికి ఎక్సైజ్ అధికారులు చేసేందేమీ లేదని, మద్యం దుకాణాల కోసం దాఖలైన వాటిలో దాదాపు 60 శాతం దరఖాస్తులు బోగస్‌వేనని చెప్పారు. ఈ దరఖాస్తులన్నింటినీ తిరిగి పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు.