ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో ఆందోళన
సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్
రూ.800 కోట్లకుపైగా కొనుగోళ్లు జరిగినట్లు అంచనా
నిజామాబాద్,నవంబర్ 23 (జనంసాక్షి) : జిల్లాలో ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా ధాన్యం కొనుగోలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 40కోట్ల వరకే చెల్లింపులు జరిగాయి. రైతుల నుంచి ఒత్తిళ్లు రావడంతో రెండు రోజుల క్రితమే సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసి ట్యాబ్ ఎంట్రీలో వేగం పెంచారు.సొసైటీల పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు అన్ని రకాల చర్యలు తీసుకున్నా మని సహకార అధికారి తెలిపారు. ఆధార్, ఫోన్ నంబర్‌కి లింక్ లేకపోవడం వల్ల ఆలస్యం జరిగినా ట్యాబ్ ఎంట్రీలో వేగం పెంచినట్లు ఆయన తెలిపారు. సొసెటీ పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఏ రోజుకు ఆరోజే ట్యాబ్ ఎంట్రీ జరిగేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఎక్కువ రోజులు ఉంచకుండా త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. వర్షాలతో తడుస్తుండడం వల్ల ధాన్యం రంగుమారడంతో పాటు మొలకెత్తుతుందని అధికారులు చొరవ తీసుకుని త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నూర్పిళ్లు కాగానే వడ్లను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తున్నారు. తేమ, తాలు ఎక్కువగా ఉంటున్నది. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ఉంటేనే మేం కొనుగోలు చేయగలం లేదంటే తర్వాత మాకు సమస్య వస్తుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారు. ప్రతి సీజన్‌లోనూ ధాన్యం కొనుగోళ్లలో ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్న ప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎఫ్‌సీఐ నిబంధనలు అమలుచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ నష్టాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు లేదా మిల్లర్లు లేదా పౌరసరఫరాలశాఖ భరించాల్సి వస్తుంది. చాలామంది హార్వెస్టర్‌తో వరిని కోసి, వడ్లను ట్రాక్టర్లకు ఎత్తి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారు. ఆరబెట్టని ఈ వడ్లలో తేమ శాతం అధికంగా ఉంటున్నది. తాలు, ఇతర వ్యర్థాలు ఉంటాయి. దీంతో ధాన్యం ఆరబోసి, తూర్పారబట్టాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. అప్పటికే కొనుగోలు కేంద్రాలు ఇలాంటి ధాన్యంతో నిండిపోవడంతో వాటిని అక్కడ ఆరబోయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు పొలాల వద్దే ఆరబెట్టి, తూర్పారబట్టి తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేస్తారు. ఆరబెట్టి, తూర్పారబోసిన, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తేనే మద్దతు ధర లభించే అవకాశమున్నది. నిర్వాహకులు తక్కువ ధర ఇచ్చినా, ఎక్కువ తరుగు తీసినా నిలదీసే హక్కు రైతులకు ఉంటుంది.