నచ్చిన పత్రికల్లో సమస్యలపై వార్తలు రాకపోతే అంతా సుభిక్షమేనా…?
వెలుగులోకి తెచ్చిన వాస్తవాలపై చిన్నా, పెద్ద పత్రికల పేరుతో చర్యలు శూన్యం
మీడియా రంగంపై వివక్షతను చూపుతున్న అధికారులు
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు సంద బాబు
ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):-
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల అక్రమ బాగోతాలను పలు పత్రికలు వెలుగులోకి తెస్తే చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు మౌనం వహించడంలో లోగుట్టు ఏముందని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సంద బాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన కథనాలపై తనిఖీలు చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్రమార్కులకే అండగా ఉండి వచ్చిన కథనం తప్పిదమని కితాబిచ్చే అవినీతి అధికారులు ములుగు జిల్లాలో విధులు నిర్వహించడం దౌర్భాగ్యమని విమర్శించారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించి వాస్తవాలను ప్రజల్లో ఎండగట్టి ప్రజల పక్షాన నిలబడే బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పత్రికలో వచ్చిన వాస్తవాన్ని ఆసరా చేసుకుని వసూళ్లకు పాల్పడిన ఘటనలు ములుగు జిల్లాలో కోకొల్లలని, ప్రగల్బాలు పలుకడం సిగ్గుచేటని అన్నారు. లంచగొండి తనాలకు అలవాటు పడిన అధికారులు ప్రజా ప్రతినిధులకు రహాస్యంగా కొమ్ముకాస్తూ మాఫీయాలకు నీడగా నిలబడి, ప్రభుత్వ ఆస్తులను, నిధులను కొల్లగొడుతున్న వాస్తవాలను, నాణ్యత లేని అభివృద్ధి పనులపై వార్తల రూపేణా వెలుగులోకి తెస్తే క్షేత్రస్థాయిలో బాగుందని, విలేకరి డబ్బులు అడినందుకు ఇవ్వలేదనే నెపంతో వార్త రాశాడనే అపవాదుని మోపే ఆనవాయితీకి అధికారులు స్వస్తి పలకాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు. చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను పక్కనపెట్టి అక్రమాల్లో తూలతూగుతున్న అధికారులకే అండగా నిలబడి మాకేమి తెలువదన్నట్లుగా నటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చిన వాస్తవాలపై చర్యలు చేపట్టక పోవడం వల్ల సంక్షేమ పథకాల్లో, ప్రభుత్వ శాఖల్లో అవినీతి వేళ్లూనుకుపోయిందని, అక్రమార్జనే ధ్యేయంగా ప్రజాసేవ పేరుతో ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు, తన ధర్మాన్ని ప్రజలపక్షం నిలిపే ప్రభుత్వ అధికారులు అభివృద్ధి కుంటుపడటంలో భాగస్వాములు కావడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి కుంటుపడటానికి కారణమైన అంశాలను వివిధ పత్రికలు వాటి విధ్యుక్త ధర్మాన్ని పాటిస్తూ వార్తలు రాస్తే చిన్నా, పెద్ద పత్రికల పేరుతో విడదీసి…. రాసిన విలేకర్లపైన అపవాదులను మూటకట్టే అధికారులదే ములుగు జిల్లాలో హవా నడుస్తుందని దుయ్య బట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి తోడ్పాల్సిన ప్రజా ప్రతినిధులను అవినీతి అక్రమాల్లో భాగస్వాములను చేస్తూ నిధుల దోపిడికి పాల్పడేలా చేసే నిష్ణాతులైన అధికారులు ములుగు జిల్లాలో విధులు నిర్వహించడం బాధాకరమన్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి అవినీతి అధికారులు గండి. కొట్టడం వల్ల ప్రభుత్వంపై పెనుభారం పడి ప్రజల జీవన విధానం అంధకారంగా మారిందని ఆవేదనను వెలిబుచ్చారు. ప్రజల పక్షాన నిలుస్తూ నిజాలను వెలుగులోకి తెస్తున్న విలేకరులను అణగదొక్కే అధికారులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ కునారిల్లుతూనే వుంటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న మీడియా రంగాలకు స్వేచ్ఛను కల్పించి పెద్ద, చిన్నా, పత్రికల పేరుతో విడదీయకుండా వచ్చిన వాస్తవాలపై తెరపత్రం లేకుండా అధికారులు చర్యలు గైకొంటే సమాజాభివృద్ధికి మార్గం సుగమమవుతుందని తెలిపారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలకు ఎదురవుతున్న ఇక్కట్లను దృష్టిలో పెట్టుకోకుండా తమ విధ్యుక్త ధర్మాన్ని ఇదే విధంగా కొనసాగించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యతను మీడియారంగం మరింత భుజానకేసుకోవాలని అన్నారు.
Attachments area
|