నర్సన్నపేట గ్రామాన్ని సీఎం దత్తత
హైదరాబాద్ అక్టోబర్ 04 (జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం నర్సన్నపేట గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్సన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎర్రవల్లితో పాటు సర్సన్నపేటను కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎర్రవల్లి, నర్సన్నపేట రాష్గానికే ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
నారాయణఖేడ్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
అభివృద్ధి, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని, చాలా గ్రామాలకు కనీసం రోడ్లు కూడా లేవన్నారు. నారాయణఖేడ్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి రూ.4వేల 500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడ్తున్నామన్నారు.
ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సానుభూతి ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నారని, అయినా ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాన్ని గొప్పగా తయారు చేసుకుందామని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాలకు మంత్రి కేటీఆర్ స్త్రీనిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. దీపం పథకం కింద పలువురికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అంతకుముందు నారాయణ్ ఖేడ్ లో వాటర్ గ్రిడ్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.