నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ పై అనర్హత వేటు.
నాగర్కర్నూల్ జిల్లాప్రతినిధి,జులై..(జనంసాక్ షి):
నాగర్కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య పదవి పై నాగర్కర్నూల్ కోర్టు అనర్హత వేటువేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నది.పద్మావతి తప్పుడు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెపై పోటీచేసిన అభ్యర్థి సుమిత్ర కోర్టును ఆశ్రయించడంతో నాగర్కర్నూల్ ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పును వెలువరించింది.పద్మావతి బంగారయ్య 2019లో తెల్కపల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమిత్రపై విజయం సాధించారు.ఆ తర్వాత ఆమె చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.మూడేళ్ళ పదవి కాలం ఇటీవలే పూర్తి చేసుకున్నారు.కాగా ఆమెకు ముగ్గురు సంతానం ఉండగా, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఇద్దరు సంతానమే ఉన్నట్లు పేర్కొన్నారని తమ ప్రత్యర్థి సుమిత్ర కోర్టుకు వెళ్లారు.గురువారం సుదీర్ఘ విచారణ అనంతరం నాగర్కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి శీతల్ తీర్పు వెలువరించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పదవికి పద్మావతి అనర్హురాలిగా ప్రకటించారు.ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ అధికార టీఆర్ఎస్ పార్టీ తర్వాత పరిస్థితులను చక్కదిద్దేపనిలో పడింది.కోర్టు తీర్పు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.