నాలుగు దశాబ్దాల తరువాత ఇబ్రహీంపట్నం చెరువు అలుగు పారడం శుభపరిణామం

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల  జీవన స్థితిగతులను శాసించే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు  47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నీటితో కళకళలాడుతూ అలుగు పారుతోందని  రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు.   ఆదివారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అలుగులో ఆయన స్థానిక రైతులతో కలిసి పెద్ద చెరువు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వాల హయాంలో  అభివృద్ధికి నోచుకోని చెరువులు కుంటలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి  చెరువులు కుంటలు వాగుల మరమ్మతులు చేపట్టారు.  అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు తోపాటు పెద్దవాగు మరమ్మతులుజిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టారు.  ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం  కింద నేడు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా అవి ఏపుగా పెరిగి  వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.  47ఏళ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నీటితో కళకళలాడుతూ అలుగు పారుతుండడంతో ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  ఎన్నో ఏళ్ల తర్వాత చెరువు నీటి తో నిండటం చాలా సంతోషంగా ఉందన్నారు.   ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహాకారంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ప్రాంతాన్ని  పర్యాటక కేంద్రంగా మార్చానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బందు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, రైతు బంధు సమితి సభ్యులు కాయితి మోహన్ రెడ్డి బూడిద నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు