నాలుగేండ్లకు ప్రజలకు నరకం చూపిస్తున్నమోడీ..

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం
రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి)
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. మోడీ నాలుగేళ్ళ పాలనను నిరసిస్తూ గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు నాలుగేళ్ళ పాలనను నిరసిస్తూ ర్యాలీగా తరలివచ్చి గాంధీ చౌరస్తా వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడుతూ నోట్ల రద్దు మొదలుకుని నాలుగేళ్ళలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతుందని పెట్రోల్‌ డీజిల్‌ ధరలను అడ్డుఅదుపులేకుండా పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్ళ మోడీ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, కౌన్సిలర్‌ మడుపు శ్రీదేవి, భైరినేని రాము, నాలుక సత్యం, వెంగళ అశోక్‌, నాయిని కిషన్‌, దాసరి వెంకటేశం, పలువురు నాయకులు, కార్యకర్తలు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంపిటిసి సూర దేవరాజు, భైరి రమేష్‌, మంగ కిరణ్‌, కొత్త రవి, తిరుపతి, సర్వయ్య, రామాగౌడ్‌, మునిగెల రాజు, మహేష్‌, రాజు, సాయిలు పాల్గొన్నారు.