నాలుగో విడత హరితహారానికి సిద్దం అవుతున్న అధికారులు
1.37 కోట్ల మొక్కలే లక్ష్యంగా ప్రణాళిక
ప్రత్యేకంగా 40 లక్షల మొక్కల పెంపకం
కరీంనగర్,జూలై13(జనం సాక్షి): జిల్లాలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఈ నెల రెండో వారం నుంచి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి 13 లక్షల 532 మొక్కలు పెంచుతున్నారు. ఈ ఏడాది 1.37 కోట్లు నాటడం లక్ష్యం కాగా మిగతా మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ప్రత్యేకంగా 40 లక్షల టేకు మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇక్కడి నర్సరీల్లో 31 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. పండ్ల మొక్కలు, గృహాల్లో పెంచుకునే మొక్కలు, రోడ్లు, కాలువలు, చెరువుల పక్కన నాటే మొక్కలకు, రైతుల పొలాల గట్లపై నాటే మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.గతేడాది జూలై 12న మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మానేరు నదీ తీరంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహాగని మొక్కను నాటారు. ఆయనతో పాటు అటవీశాఖ మంత్రి జోగు
రామన్న, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇక్కడ మొక్కలు నాటారు. ఇపుడు వీటిని అటవీశాఖ అధికారులు ప్రాణసమానంగా పెంచుతున్నారు. మానేరు జలాశయం ఆనకట్ట చివర అంటే పద్మనగర్ నుంచి గేట్ల వరకు ఇపుడు ఎక్కడ చూసిన ఎదుగుతున్న మొక్కలే కనిపిస్తున్నాయి. కొన్ని బ్లాక్‌లుగా విడదీసి ఈ ప్రాంతంలో నాటిన మొక్కలను సంరక్షిస్తున్నారు.తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో మూడు విడతల్లో విజయవంతంగా నిర్వహించారు.అప్పుడు నాటిన మొక్కలు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువగా దక్కలేదు. అయితే అధికారులు మిగతా రెండు విడతల్లో నాటిన మొక్కల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 33.29 శాతం మొక్కలు బతికినట్లు అధికారులు చెబుతున్నారు. మొక్కలు నాటిన ప్రాంతాల్లోకి పశువులు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఫినిషింగ్ చేశారు. నాటిన మొక్కల్లో ఇప్పటికే 90 శాతానికిపైగా ఎదుగుతున్నాయి. మానేరు ఆనకట్ట వెంట ఉన్న సిరిసిల్ల, జగిత్యాల బైపాస్ రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ల మధ్యన నాటిన మొక్కలు కూడా స్వేచ్ఛగా ఎదుగుతున్నాయి. అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని సంరక్షిస్తోంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఎప్పటిలాగే శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. ఈసారి ముఖ్యమైన 28 శాఖలకు
మాత్రమే ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలు నాటే లక్ష్యంతో అధికారులు ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఇప్పటికే మూడు విడతలో పెద్ద ఎత్తున మొక్కలు నాటగా అవి క్రమక్రమంగా పెద్దవవుతున్నాయి.



