నిండు కుటుంబాన్ని బలిగొన్న లారీ
పెద్దపల్లి(జనం సాక్షి) : అతివేగం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలివి.. ఓ దంపతులు వారి పిల్లలతో ఓ కారులో బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న వారి కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపలి వద్ద రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి స్వస్థలానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు మంథనికి చెందిన అకుల వరుణ్, సౌమ్య, అఖిలేష్ కుమార్(10), శాన్వి(08)లుగా గుర్తించారు. వరుణ్ మంథనిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అని సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.