నిప్పులు చిమ్ముతూ నింగికి
– పీఎస్‌ఎల్‌వీ సి28 ప్రయోగం విజయవంతం
– ఇస్రో చరిత్రలో మరో మైలురాయి
హైదరాబాద్ జులై10(జనంసాక్షి):
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ- సీ28 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 1440 కిలోల బరువుగల ఐదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.బుధవారం ఉదయం 7.28 గంటలకు ప్రారంభమైన కౌంట్థ్|న్ ప్రక్రియ 62.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి శుక్రవారం రాత్రి9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చరిత్రలోనే భారీ వాణిజ్య ప్రయోగంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఆనందంలో ఇస్రో శాస్త్రవేత్తలు
పీఎస్‌ఎల్వీ సీ-28 ప్రయోగం విజయవంతమవటంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగితేలారు. ప్రయోగం విజయవంతమైన అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు.
ప్రయోగం.. ప్రత్యేకతలు
ప్రయోగించిన ఉపగ్రహాలు వీటన్నింటి బరువు: 1440 కిలోలు తయారీదారు: బ్రిటన్‌కు చెందిన సర్రే సంస్థ ఇంత బరువు కలిగిన వాణిజ్య ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ చేపట్టడం ఇదే మొదటిసారి. లోగడ యాంత్రిక్స్ సంస్థ చేపట్టిన భారీ వాణిజ్య ప్రయోగం.. 712 కిలోల బరువైన స్పాట్-7 అనే ఫ్రాన్స్ ఉపగ్రహం. 2014 జూన్ 30న పీఎస్‌ఎల్‌వీ ద్వారానే దీని ప్రయోగం జరిగింది. అధిక సామర్థ్యమున్న పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ వెర్షన్‌ను ఉపయోగించడం ఇది 9వ సారి. మొత్తంమీద పీఎస్‌ఎల్‌వీకి ఇది 30వ ప్రయోగం. ఈ రాకెట్ పొడవు: 44.4 మీటర్లు బరువు: 320 టన్నులు ఈ ప్రయోగం కోసం పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రకాన్ని ఇస్రో ఉపయోగించింది. లోగడ 2013 నవంబర్ 5న అంగారక ఉపగ్రహం.. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను, 2008 అక్టోబర్ 22న చంద్రయాన్-1ను ప్రయోగించడానికి కూడా ఇదే రకాన్ని ఉపయోగించింది. పీఎస్‌ఎల్‌వీ-సి28 మోసుకెళ్లనున్న ఐదు విదేశీ ఉపగ్రహాల బరువు 1440 కిలోలు. ఇస్రో, దాని వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్ కార్పొరేషన్ చేపడుతున్న అత్యంత భారీ వాణిజ్య ప్రయోగం ఇదే. ఇందులో మూడు డీఎంసీ3 ఆప్టికల్ భూ పరిశీలన ఉపగ్రహాలు, సీబీఎన్‌టీ-1, డి-ఆర్బిట్‌సెయిల్ అనే రెండు చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి.బుల్లి ఉపగ్రహాలు డీఎంసీ3 ఉపగ్రహాలతో పాటు వెళ్లిన సీబీఎన్‌టీ-1 బరువు 91 కిలోలు దీన్ని కూడా ఎస్‌ఎస్‌టీఎల్ సంస్థే రూపొందించింది. ఇది ప్రయోగాత్మక భూ పరిశీలన సూక్ష్మ ఉపగ్రహం.చి డి-ఆర్బిట్‌సెయిల్ ఉపగ్రహం బరువు 7 కిలోలు. దీన్ని సర్రే స్పేస్ సెంటర్ రూపొందించింది. ఇది ప్రయోగాత్మక నానో ఉపగ్రహం. ఇందులో పలుచటి పొర కలిగిన భారీ తెరచాప ఉంటుంది.
ఈ ఐదు ఉపగ్రహాలను ఎస్‌ఎస్‌టీఎల్ అనుబంధ సంస్థ అయిన డీఎంసీ ఇంటర్నేషనల్ ఇమేజింగ్ (డీఎంసీఐఐ), యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రయోగించారు.
బోలెడు ప్రయోజనాలు
డీఎంసీ3 1, 2, 3 ఉపగ్రహాలు ఒకేలా ఉంటాయి. ఒక్కోదాని బరువు 447 కిలోలు. పొడవు 3 మీటర్లు. ఏడేళ్లపాటు సేవలు అందిస్తాయి. వీటిని 647 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్యఅనువర్తిత కక్ష్యలో పీఎస్‌ఎల్‌వీ ప్రవేశపెడుతుంది. వీటిని బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌ఎస్‌టీఎల్) తయారు చేసింది.
ఈ మూడు ఉపగ్రహాలకు సంబంధించి పూర్తి హక్కులను చెయనాకు చెందిన 21 ఏటీ అనే సంస్థ కొనుగోలు చేసింది. అవసరమైన డేటాను ఈ సంస్థ ద్వారా ప్రపంచ దేశాలు పొందనున్నాయి.
డీఎంసీ3 ఉపగ్రహాలు అత్యధిక రిజల్యూషన్‌తో భూ పరిశీలన చేపడతాయి. ఇవి ఒకేసారి కక్ష్యలో ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూ ఛాయాచిత్రాలను తీస్తాయి. ప్రతిరోజూ భూమిపై ఏ లక్ష్యాన్నైనా అవి చిత్రీకరించగలవు.
భూమిపై ఉన్న వనరుల సర్వే, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి, పట్టణాభివృద్ధి పర్యవేక్షణకు, విపత్తులు సమయంలో సహాయ కార్యక్రమాల సమన్వయానికి ఇవి ఉపయోగపడతాయి.