నిర్లక్ష్యం నీడలో కాకినాడ ప్రభుత్వాసుపత్రి
రోగులను పట్టించుకోని వైద్యులు
కాకినాడ, జూలై 11, : ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుండి కూడా వేలాది మంది రోగులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే జిజిహెచ్‌లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులకు చికిత్సనందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారించడం పట్ల రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర విభాగంలో అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా అందడంతో ఎంతో మంది క్షతగాత్రులు, రోగులు ప్రాణాలను కోల్పోతున్నారు.వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇటువంటి పరిస్థితి దాపురిస్తుందని ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవానికి వేరే ప్రైవేట్ ఉద్యోగాలు నిబంధనల ప్రకారం చేయకూడదన్న నిబంధన ఉన్నా, అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో వైద్యులకు క్లినిక్‌లు పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడంతో ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు క్లినిక్‌ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారే క్లినిక్‌లో అతని పరిస్థితి చూస్తే ఎంతో మెరుగైన వైద్య సేవలను అందిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వైద్యులు కాకినాడ నగరంలో ఉన్నప్పటికీ వారు ప్రైవేట్ ఆసుపత్రులకు పరిమితమైపోతున్నారు. అదే వైద్యాధికారులు విధుల్లో అతి తక్కువ కాలం గడుపుతూ డ్యూటీ ముగిసిన వెంటనే ఆసుపత్రిలో ధనిక రోగులను వారి క్లినిక్‌లకు తరలించుకుపోతున్నారన్న ఆరోపణలున్నాయి. రక్తపరీక్షలు, ఇతర చికిత్సకు సంబంధించిన పరీక్షలు, ఎక్స్‌రేలు కూడా వైద్యాధికారులకు, సిబ్బందికి సంబంధించిన ప్రైవేట్ క్లినిక్‌లకు తరలిస్తున్నారు. తరలించినందుకు గానూ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలోని కొంత మంది కమీషన్ పద్దతిపై వైద్యులు జీతాలు కూడా చెల్లిస్తున్నారు. ఈ తంతు అంతా జిల్లా కలెక్టర్‌కు తెలిసినప్పటికీ తెలిసీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.