నెలాఖరుకల్లా వందశాతం వ్యాక్సినేషన్‌

` వ్యాక్సినేషన్‌ పూర్తిలో పోటీతత్వం రావాలి

` కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి`

అధికారులతో సవిూక్షలో మంత్రిహరీష్‌ రావు

హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): ఈ నెలాఖరుకల్లా  వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్యాధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చినందున మూడవ దశను సమర్థ వంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్‌ తక్కువ జరిగిన ప్రాంతాలను గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నూరు శాతం పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయుటకు పోటీతత్వం పెంచాలని సూచించారు. కొవిడ్‌ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్లు, వైద్యాధికారులు, విద్యా శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కొవిడ్‌ పరిస్థితులు, ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు వ్యాక్సినేషన్‌ పక్రియపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ªూష్ట్రంలో మొదటి డోసు 90 శాతం పూర్తి అవడానికి వైద్య, మున్సిపల్‌, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పని చేయడం వల్ల సాధ్యమైందన్నారు. దేశంలోనే వంద శాతం వాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్టాన్న్రి ముందుంచేందుకు కలెక్టరులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని మంత్రి సూచించారు. మొదటి, రెండు డోస్‌లు ప్రతి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకా తీసుకునేలా చూడాలని తెలిపారు. ప్రతి గ్రామాన్ని, మండలాన్ని, మున్సిపల్‌ వార్డును, జిల్లాను వంద శాతం వ్యాక్సిన్‌ అయినట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మనమందరం మొదటి రెండు దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కరోనా మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడవ దశను ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం ప్రజలకు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తప్పక రెండు డోసులు వాక్సినేషన్‌ తీసుకోవాలని తెలిపారు. విద్యా సంస్థలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్‌ తీసుకునేలా చూడాలన్నారు. విద్యార్థులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయాలని చెప్పారు.