నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

C

అస్త్రశస్త్రాలతో సిద్దం అవుతున్న విపక్షాలు

ధీటుగా సమాధానం ఇవ్వనున్న అధికార పక్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి):

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రాంభం కానున్నాయి. ఇంతకాలం సభ బయట విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు ఇక సర్కార్‌ను నిలదీయాలని అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. రైతు ఆత్మహత్యలు సహా.. పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టి సమావేశాలను తమకు అనుకూలంగా ముగించాలని సర్కారు పట్టుదలగా ఉంది. అయితే ఏ అంశంపైన అయినా గట్టిగా సమాధానం చెప్పాలన్న సంకత్పంతో సిఎం కెసిఆర్‌ ఉన్నారు. ఏ సమస్యకైనా ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 23నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నా, ఎన్ని రోజులు అన్నది బిఎసి నిర్ణయించనుంది. అయితే సమస్యలపై చర్చించేందుకు ఎన్ని రోజులయినా నడపడానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం కూడా సంకేతాలు ఇస్తోంది.  ఇటీవలే మరణించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సంతాపం తెలిపాక తొలిరోజు సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బిఏసీ సమావేశం జరగనుంది… ఇందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై చర్చించనున్నారు. ప్రధానంగా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.. ప్రతిపక్షాలు  సర్కారు తీరుపై మండిపడుతున్నాయి… ఈ అంశంపై సభలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.. అయితే ప్రభుత్వం విపక్షాలను కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచిన ప్రభుత్వం.. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల వివరాలను, వారి ఆత్మహత్యలకు కారణాలను సేకరిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ఆత్మహత్యల వివరాలనూ సభ ముందుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సభలో ప్రకటన చేసే అవకాశమూ ఉంది. దీనికితోడు గతంలో వ్యవసాయ విధానం, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై వాస్తవ విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రాజెక్టుల రీడిజైన్‌  అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని  విపక్షం చూస్తోంది. నిర్మాణంలోని ప్రాజెక్టుల వివరాలు, రైతులకు జరిగే మేళ్ల గురించిన వివరాలతో విపక్షాన్ని నిలువరించాలని సర్కారు యోచిస్తోంది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపు హావిూలపై ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఇటీవల పారిశుద్య కార్మికుల సమ్మె, ఆశా కార్యకర్తల సమ్మె తదితర అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఇప్పటివరకూ అడుకుకూడా ముందుకుపడలేదు.. ఇక ఫీజు బకాయిలు, ఉస్మానియా యూనివర్శిటీ దుస్థితి, నకిలీ విత్తనాలు, మైనారిటీ, ఎస్టీల రిజర్వేషన్లు, ఎన్‌కౌంటర్‌, ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాలపై సభలో వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్‌ ఉంది.. అధికార, ప్రతిపక్షాల ప్రత్యేక వ్యూహాలతో ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సిఎం కెసిఆర్‌ , ఆయన  మంత్రులు ధీటుగా స్పందించేందుకు రెడీ అవుతున్నారు.

సమస్యలను ప్రస్తావిస్తాం: లక్ష్మణ్‌

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని  బిజెపి

శాసనసభా పక్షం నిర్ణయించింది. కరవు పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల డిజైన్‌ మార్పు, విష జ్వరాలు, నిరుద్యోగ సమస్య, బీసీ ఉపప్రణాళిక తదితర అంశాలపై సభలో ప్రశ్నించాలని నేతలు నిర్ణయించారు.  రాష్ట్రం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సభలో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 1300 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల గణాంకాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత, తప్పుడు నిర్ణయాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ వాయిదా పద్ధతిలో కాకుండా ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరవు మండలాల నివేదికలు తయారు చేయకపోవడం కూడా ప్రస్తావించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అయోమయ పరిస్థితి నెలకొందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినట్లే డబ్బుల కోసం ప్రాజెక్టుల ఆకృతిని మారుస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని ఉపశమనం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ధ్వజమెత్తారు.

టిఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు: టిడిపి

రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని టిఆర్‌ఎస్‌ తప్పుకోవాలని చూస్తోంది. దీనిపై సర్కార్‌ను నిలదీస్తామని టిడిపి పక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా తెరాస ఉందని.. అంటే ఆత్మహత్యలకు తెరాస కూడా కారణమేనని అన్నారు. రైతుల సమస్యలపై తెరాసకు చిత్తశుద్ధి లేదన్నారు. హైదరాబాద్‌లో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు.  వివిధ సమస్యలపై సర్కార్‌ తీరును ఎండగట్టేందుకు వెనకాడమన్నారు.

రైతు ఆత్మహత్యలపై వితండవాదం: టిఆర్‌ఎస్‌

ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు ముందుకు వస్తే… ప్రతిపక్షాలు హర్షించాల్సింది పోయి, విమర్శలకు దిగడం దుర్మార్గమని టిఆర్‌ఎస్‌ శ్రీనివాస్‌గౌడ్‌  మండిపడ్డారు. 58 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌, టిడిపిల దూరదృష్టిలేని విధానాల ఫలితంగానే.. నేడు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పంట నష్టం, కనీస మద్దతు ధర అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివని… వీటిపై భాజపా, తెదేపా నేతలు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని నిలదీశారు.రైతుల ఆత్మహత్యలకు 60 ఏళ్లు అధికారంలో ఉన్నవారు కారణమవుతారా? ఏడాదిన్నర క్రితం అధికారం చేపట్టిన వాళ్లు కారణమవుతారా? అని ప్రశ్నించారు. అయినా అసెంబ్లీలో ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కొంటామన్నారు.