నేటినుంచే మేడారం జనజాతర

గిరిజన జాతరకు భారీగా ఏర్పాట్లు
నుడు గద్దెనెక్కనున్న అమ్మవారు
భారీగా తరలివస్తున్న ప్రజలు
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ములుగు,ఫిబ్రవరి15(జనం సాక్షి): మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో బుధవారం జాతర ప్రారంభమవుతోంది.గిరజనజాతరకోసం జనమంతా మేడారం గద్దెలవైపు కదలుతున్నారు. ఇసుకేస్తే రాలనంతగా గత రెండు మూడు రోజులుగా అమ్మవారి గద్దెలను దర్శించుకుంటున్నారు. ఈ నెల 16న బుధవారం నుంచి 19 వరకు మూడు రోజులపాటు జాతర జరగనుంది. జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 75 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మహా జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు రానుండడంతో ట్రాఫిక్‌ సమస్యపై అధికారులు దృష్టి పెట్టారు. జాతరలో వాహనాల కోసం 33 పార్కింగ్‌ స్థలాలు, 37 ట్రాఫిక్‌ హోల్డింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌తో పాటు ఇతరాత్ర సమాచారం తెలిపేందుకు జాతర మార్గంలోని రహదారులపై 20 డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు పెట్టారు. మేడారం మహా జాతరలో మంగళవారం తొలి ఘట్టం ఆవిష్కృతంª`అయ్యింది. పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు చేపట్టారు. మహబూబాబాద్‌ జిల్లా, గంగారం మండలం, పూనుగొండ్ల నుంచి కోయ పూజారులు గోవిందరాజును పెళ్లికొడుకుగా తయారు చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం మేడారానికి తీసుకువస్తారు. కాలినడకన బయలుదేరి బుధవారం సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. సారలమ్మ సహా రేపు గద్దలపైకి గోవిందరాజు వస్తారు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్టాల్రతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వాహనాలతో పార్కింగ్‌ స్థలాలు నిండిపోతున్నాయి. వీఐపీ, వీవీఐపీల పార్కింగ్‌ ఏరియాలు కూడా రద్దీగా మారాయి.ఇప్పటికే అరకోటి మంది మంది భక్తులు తల్లుల గ్దదెలను దర్శించుకున్నారు. గద్దెల పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం అనంతరం పరిసరాల్లో విడిదిచేసి దేవతలకు బలిచ్చిన మేకలు, గొర్రెలు, కోళ్లతో విందు భోజనాలు చేశారు. పోలీసు, వివిధ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో జాతర విధుల్లో చేరారు. వాహనాల రద్దీనిబట్టి వన్‌వేను అమలు చేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మలను గ్దదెలపైకి తీసుకొచ్చే సమయంలో బందోబస్తు ఏర్పాటుపై పోలీసు అధికారులు మాక్‌డ్రిల్‌ చేశారు. జంపన్నవాగు, మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్డున ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం జంపన్న, నాగులమ్మలకు మొక్కులు చెల్లించుకుని కాలినడకన గద్దెలకు చేరుకుంటున్నారు. క్యూలైన్ల గుండా నిలువెత్తు బంగారాన్ని నెత్తినమోస్తూ సమ్మక్క`సారలమ్మ నామస్మరణలతో జేజేలు కొడుతూ చీర, సారె, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, పసుపు, కుంకుమ సమర్పించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ నియంత్రణ, రద్దీ నిర్మూలనను సమగ్రంగా చేపట్టారు. నార్లాపూర్‌ నుంచి మేడారం వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బారులుతీరిన వాహనాలను పార్కింగ్‌ స్థలాలకు పంపుతూ రద్దీ తగ్గుతున్న క్రమంలో మేడారం వైపు
వాహనాలను తరలించారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టారు.