నేడు కరీంనగర్‌ రానున్న గడ్కరీ

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరు  ప్రధానమైన సమస్యలు, వాటి అనుబంధ సమస్యలకు జాతీయస్థాయిలో ప్రధాన్యత తీసుకొచ్చి పరిష్కార మార్గాలను అన్వేషించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తెచ్చిందుకు కరీంనగర్‌ వేదికైంది. అమరవీరులు స్మారక పరిశోధన సంస్థ (ఎంఎంఆర్‌) ఆధ్వర్యంలో రైతులు, బీడీ కార్మికులు, చేనేత , గిరిజన, సింగరేణి, గల్ఫ్‌ సమస్యలపై కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో చర్చా సమ్మేళనానికి ముఖ్యఅతిధిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, జయాజైట్లీ తదితరులు హాజరవుతున్నారు. గౌహతి నుంచి నేరు గా హైదరాబాద్‌  చేరుకొని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో గడ్కరీ కరీంనగర్‌ చేరుకుంటారు. ఉదయం తొమ్మిది గంటలకు సమ్మేళనం ప్రారంభం కాగానే.. ఆయా అంశాలపై ఆరు బృందాలు చర్చలు సాగిస్తాయి. సాయంత్రం 5:30 గంటలవరకు సమ్మేళనంలో పాల్గొని తిరిగి వెళ్తారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఎంపిక చేసిన నాలుగు వేల మంది ప్రతినిధులు చర్చా-సమ్మేళనానికి హాజరుకానున్నారు.