న్యాయవాదుల ఆందోళన
ఆదిలాబాద్, జూలై 10 : విదేశీ న్యాయవాదులకు దేశంలో అవకాశం కల్పించేలా కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 11, 12వ తేదీల్లో న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ ఆసోషియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరావు తెలిపారు. భారత న్యాయస్థానాలలో విదేశీ న్యాయవాదులను రప్పించేలా యూపీఏ సర్కార్ చేస్తున్న కుట్రలను న్యాయవాదులు అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌లు ఇచ్చిన పిలుపుమేరకు 11, 12, తేదీల్లో రెండు రోజులపాటు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 11న అన్ని న్యాయస్థానాల ముందు బిల్లుల ప్రతుల దహనం, 12వ తేదీన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఉంటుందని ఈ ఆందోళన కార్యక్రమాల్లో న్యాయవాదులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.